Site icon NTV Telugu

NTR30: ఆ హీరోయిన్ కూడా ఔట్..?

Shraddha Walked Out Of Ntr30

Shraddha Walked Out Of Ntr30

జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో NTR30 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! నిజానికి, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా.. స్క్రిప్టుని ఫైనల్ చేయడంలోనే ఎక్కువ జాప్యం అవుతోంది. తొలుత ప్రాంతీయ చిత్రంగానే దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో, అందుకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఆ పనులు పూర్తి కావొచ్చాయి కాబట్టి, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ సమాయత్తమవుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ సినిమాలో కథానాయికగా తొలుత ఆలియా భట్‌ని అనుకున్నారు. ఆర్ఆర్ఆర్‌తో ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమా సమయంలోనే తారక్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడడం, NTR30 ఓ పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఆలియా కూడా ఈ సినిమా చేసేందుకు మొదట్లో ఆసక్తి కనబరిచినట్టు వార్తలొచ్చాయి. అధికార ప్రకటనైతే రాలేదు కానీ, దాదాపు ఆలియానే తారక్ సరసన ఫిక్స్ అయినట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ చిత్రం జాప్యమవుతూ వస్తుండడంతో ఆ అమ్మడు తప్పుకుందట! దీంతో, ఇతర హీరోయిన్లను మేకర్స్ పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎందరో స్టార్ హీరోయిన్ల పేర్లు తెరమీదకొచ్చాయి. వాటిల్లో శ్రద్ధా కపూర్ పేరు కూడా ఒకటి!

ఆల్రెడీ ‘సాహో’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ భామకి, బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. ఈమెనే తీసుకోవాలని మేకర్స్ భావించారు. అయితే, ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మడు కూడా చేతులెత్తేసిందని సమాచారం. తద్వారా మేకర్స్ మరో భామ కోసం సెర్చింగ్ మొదలుపెట్టారని తెలుస్తోంది. మరి, తారక్ సరసన నటించబోయే ఆ లక్కీ బ్యూటీ ఎవరో వేచి చూడాల్సిందే!

Exit mobile version