Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ ‘దైవబలం’తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు. అలాగే యన్టీఆర్, శోభన్ ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించారు. తన చిత్రం ద్వారా పరిచయమైన శోభన్ కు చిత్రసీమలో మంచి భవిష్యత్ ఉండాలని ఆశించారు. దాదాపు తాను నటించిన పాతిక చిత్రాలలో శోభన్ కు కీలక పాత్రలు ఇప్పించి, ప్రోత్సహించారు యన్టీఆర్. క్రమశిక్షణలోనూ, సమయపాలనలోనూ యన్టీఆర్ నే ఆదర్శంగా తీసుకొని సాగారు శోభన్ బాబు. అయితే ఒక్క విషయంలో మాత్రం యన్టీఆర్ ను ఫాలో కాలేక పోయానని అంటూ ఉండేవారు శోభన్. ఏమిటది?
యన్టీఆర్, శోభన్ కంటే 16 సంవత్సరాలు వయసులో పెద్దవారు. అలాగే యన్టీఆర్, కృష్ణకంటే 20 ఏళ్ళు సీనియర్. కానీ, సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరికీ యన్టీఆర్ అన్నగా నటించేవారు. కృష్ణ, శోభన్ బాబు కంటే యన్టీఆర్ గ్లామర్ గా కనిపించేవారు. వీరు ముగ్గురూ కలసి ‘విచిత్ర కుటుంబం’లో నటించారు. అందులో యన్టీఆర్ తమ్ముళ్ళుగా శోభన్, కృష్ణ అభినయించారు. అప్పటి నుంచీ శోభన్, కృష్ణ పలు విషయాల్లో రామారావును అనుసరించసాగారు. యన్టీఆర్ భోజనప్రియుడు. తనకు ఇష్టమైనవి ఏ మాత్రం మొహమాటం లేకుండా లాగించేవారు రామారావు. అయినప్పటికీ యన్టీఆర్ తన గ్లామర్ ను కాపాడుకొనేవారు. శోభన్ బాబు తన అందాన్ని పరిరక్షించుకోవడానికి మితాహారం తీసుకొనేవారు. ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలపై ఆధారపడేవారు శోభన్. అన్ని విషయాల్లోనూ యన్టీఆర్ ను ఫాలో అయ్యారు శోభన్. రామారావు తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలూ పోషించి మెప్పించారు శోభన్. అలాగే యన్టీఆర్ తరువాత అందాల నటుడు అనీ గుర్తింపు పొందారు. ఇంతలా ఆయనను అనుసరిస్తూ సాగినా, శోభన్ బాబు మాత్రం తిండి విషయంలో యన్టీఆర్ ను ఫాలో కాలేకపోయానని అనేవారు. ఎంత తిన్నా అన్నగారి గ్లామర్ చెక్కుచెదిరిదే కాదని, అదే ఆయనలా తాము తిన్నామంటే, అంతే సంగతులు అనీ శోభన్ తరచూ చెప్పేవారు.