Double XL:ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆటగాడిగా ఫెయిల్ అయినా కెప్టెన్‌గా లక్కు దక్కింది. సౌతాఫ్రికా టీమ్ తో 50 ఓవర్ల వన్ డే సిరీస్‌లో ఇండియన్ క్రికెట్ టీమ్ కు శిఖర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తొలి వన్డేలో ఓడినా ఆ తర్వాత రెండు వన్డేలలో గెలిచి ఇండియా సీరీస్ గెలిచింది. ఇక శిఖర్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే అతను బిగ్ స్క్రీన్ పై అక్టోబర్ 14న కనువిందు చేయబోతున్నాడు. అదెలాగంటే సోనాక్షి సిన్హా, హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలు పోషించిన ‘డబుల్ ఎక్స్ ఎల్’ మూవీ ఆ రోజున జనం ముందుకు రానుంది. ఇందులో శిఖర్ ధవన్ కూడా నటించడం విశేషం!
‘డబుల్ ఎక్స్ ఎల్’ టైటిల్ లోనే ఇది బొద్దుగా ఉండేవారి కథ అని ఇట్టే తెలిసిపోతోంది. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు సోనాక్షి, హ్యుమా ఇద్దరూ బొద్దుగా కనిపించబోతున్నారు. అంతేకాదు వారిద్దరూ కలసి చేసే వినోదం జనానికి చక్కిలిగింతలు పెడుతుందని దర్శకుడు సత్రం రమణి అంటున్నాడు. ఇక ఈ సినిమాలో తాను నటించడానికి కారణం ఎంటర్ టైన్ మెంట్ అని చెబుతున్నాడు శిఖర్. ఎప్పుడూ క్రికెట్ తో బిజీగా ఉండే తాను రిలీఫ్ కోసం వినోదభరితమైన చిత్రాలు చూస్తూ ఉంటానని అంటున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలోనూ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నట్టూ శిఖర్ చెబుతున్నాడు. ‘సైజ్ జీరో’ తెలుగు సినిమాలో అనుష్క ముద్దుగా బొద్దుగా కనిపించి వినోదం పంచింది. అదే తీరున ‘డబుల్ ఎక్స్ ఎల్’లో సోనాక్షి, హ్యుమా మరింతగా రెచ్చిపోయి జనాన్ని ఎంటర్ టైన్ చేయనున్నారు. వారి బొద్దందాల నడుమ శిఖర్ వంటి ఫిట్ నెస్ క్రికెటర్ యాక్టింగ్ ఏ తీరున సాగిందో చూడాలన జనానికీ ఆసక్తి కలుగుతోంది. అక్టోబర్ 14 మరో రెండు రోజుల్లో రానుంది. సో.. ‘డబుల్ ఎక్స్ ఎల్’ లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, శిఖర్ యాక్టింగ్ స్కిల్స్ నూ చూసేయవచ్చు.