Shaitaan: కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి, కుటుంబాన్ని చూసుకుంటూ కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. ఇక పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా ఒకపక్క, నటిగా ఇంకోపక్క వరుస అవకాశాలను అందుకుంటుంది. మొదటి నుంచి కూడా జ్యోతిక ఎంచుకొనే సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇక రీ ఎంట్రీలో అయితే మరింత పకడ్బందీగా కథలను ఎంచుకుంటూ ఉంది. ఈ మధ్యనే మలయాళంలో మమ్ముట్టి సరసన కాథల్.. ది కొర్ సినిమాలో నటించి మెప్పించింది.
ఇక తాజాగా జ్యోతిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. అజయ్ దేవగన్, ఆర్. మాధవన్ హీరోలుగా నటిస్తున్న చిత్రం సైతాన్. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మరో రెండు బ్యానర్స్ తో కలిసి దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్ పై అజయ్ దేవగన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో జ్యోతిక కీలక పాత్రలో నటిస్తోంది. జ్యోతిక చివరిగా బాలీవుడ్ లో లిటిల్ జాన్ అనే చిత్రంలోనటించింది. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హారర్ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి అర్ధమవుతుంది. ఇక ఇందులో మాధవన్ చేతబడి చేసేవాడుగా కనిపించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో చేతబడుల నేపథ్యంలో సినిమాలు వచ్చి హిట్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ కూడా ఆ విజయ సూత్రాన్ని పట్టేసింది. మరి బాలీవుడ్.. తమ హర్రర్ తో ప్రేక్షకులను ఎలా భయపెట్టనున్నారో చూడాలి.
