NTV Telugu Site icon

Shahrukh Khan: షారుఖ్ ను వదిలి పెట్టని బాయ్ కాట్ బ్యాచ్!

Sharukh

Sharukh

Shahrukh Khan:దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత ‘పఠాన్’తో తనకు ఓ సాలిడ్ హిట్ రావడంతో షారుఖ్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నారు. ‘పఠాన్’ సినిమా వేయి కోట్లు పోగేసే దిశగా సాగుతోంది. షారుఖ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ మీడియా కోడై కూస్తోంది. ఇది షారుఖ్ విజయమే కాదని, బాలీవుడ్ కు కూడా బిగ్ సక్సెస్ అని అంటున్నారు హిందీ బాబులు. ‘పఠాన్’ సినిమా టైటిల్ ఓ వర్గానికి చెందినట్టుగా ఉందని, మొదటి నుంచీ ఈ సినిమాను కొందరు వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాంటి వారు ‘బాయ్ కాట్’ అంటూ పిలుపు నిచ్చారు. అందరి అంచనాలనూ తలకిందులు చేసింది ‘పఠాన్’. ఈ సినిమాను రక్షించవలసిందిగా కోరుతూ షారుఖ్ కు మంచి మిత్రుడైన సునీల్ శెట్టి సోషల్ మీడియా ద్వారా దేశనాయకులనూ అభ్యర్థించారు. సానుకూల పవనాలే వీచాయి. దాంతో ‘బాయ్ కాట్’ బ్యాచ్ తెల్లమొహం వేయవలసి వచ్చింది. అయితే మేమేమీ తక్కువ కాదంటూ మళ్ళీ వారు చెలరేగుతున్నారు. షారుఖ్ అదృష్ట దేవత దీపికా పదుకొణే ఉన్న కారణంగానే ‘పఠాన్’ ఆ స్థాయి సక్సెస్ సాధించిందని వారు అంటున్నారు. అంతే తప్ప ఇది షారుఖ్ ఖాన్ ఘనవిజయంగా వారు అంగీకరించడం లేదు. షారుఖ్ రాబోయే సినిమా ‘జవాన్’లో సౌత్ సూపర్ హీరోయిన్ నయనతార నాయిక. కాబట్టి షారుఖ్ కు ‘జవాన్’ కంగు తినిపించడం ఖాయం అంటున్నారు ‘బాయ్ కాట్’ బ్యాచ్.

సౌత్ సినిమాల తాకిడికి దాదాపు ఐదేళ్ళ నుంచీ బాలీవుడ్ కుదేలవుతూ వస్తోంది. ఈ సారి ‘పఠాన్’ రూపంలో సౌత్ సినిమాలకు దీటుగా నిలిచే చిత్రం వచ్చిందనీ ఉత్తరాది మీడియా జబ్బలు చరుచుకుంటూ ఉంది. ఇక్కడే వాళ్ళు తప్పులో కాలేశారు. షారుఖ్ అదృష్టదేవత దీపికా పదుకొణే ఎక్కడ నుండి వచ్చింది? రాబోయే షారుఖ్ ‘జవాన్’ డైరెక్టర్ ఎవరు? ‘జవాన్’ హీరోయిన్ ఎవరు? అంటూ షారుఖ్ ను వ్యతిరేకించే వర్గం మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దీపికను అడ్డు పెట్టుకొని ‘పఠాన్’ రూపంలో సాలిడ్ హిట్ పట్టేసినా, ‘జవాన్’ తో ఆ స్థాయి సక్సెస్ సాధిస్తేనే షారుఖ్ ను స్టార్ అని అంగీకరిస్తామనీ వారు అంటున్నారు. మరి జూన్ 2న జనం ముందుకు రానున్న ‘జవాన్’ ఏం చేస్తాడో చూడాలి.

Show comments