అందరిలో ఆసక్తి కలిగించే విషయాలు నాలుగు ప్రధానాంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలని క్రీస్తు పూర్వం నుంచీ ఎందరో తాత్వికులు ప్రతిపాదించారు. నవీనయుగం ఆ నాలుగు అంశాలనూ “Political, Economical, Social and Technological” అంటూ పేర్చి, ముద్దుగా ‘PEST’ అని పెట్టుకుంది. ఈ నాలుగు అంశాల నుంచి తప్పించుకొనే ప్రధాన అంశాలేవీ ఉండవు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ‘డ్రగ్స్’ కేసు నుండి ‘క్లీన్ చిట్’తో బయట పడగానే ఈ అంశాలే సందడి చేస్తున్నాయి.
ఆర్యన్ కు Narcotics Control Bureau (NCB) క్లీన్ చిట్ ఇవ్వగానే రాజకీయ కోణం నోరు తెరచింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, బాలీవుడ్ ను భ్రష్టు పట్టించాలనే ఆర్యన్ ఖాన్ ను అన్యాయం కేసులో ఇరికించిందని, అయితే చివరకు సత్యమే గెలిచిందని ‘మహారాష్ట్ర వికాస్ అఘాది’ అంటోంది. శివసేన ఎమ్.పి. ప్రియాంక చతుర్వేది కూడా “సదా సత్యమేవ జయతే” అంటూ గళం కలిపారు. ఇలా రాజకీయ కోణం గొంతు విప్పింది. కాగా, ఆర్థిక పరమైన కోణంలో ‘షారుఖ్ ఖాన్ కోట్లకు పడగలెత్తినవాడు కాబట్టి, ప్రభుత్వాలను, ప్రభుత్వ సంస్థలను ఎలాగోలా మేనేజ్ చేసి, తనయుడికి ‘క్లీన్ చిట్’ ఇప్పించుకోగలిగాడు” అంటూ వినిపిస్తోంది.
“ఇలాంటి కేసుల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి? పార్టీలకు పోతే అందరూ డ్రగ్స్ తీసుకోరు. ఆ రోజు పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదు మొర్రో అన్నా, ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి మూడువారాలకు పైగా జైలులో ఉంచారు. తరువాత బెయిల్ దొరికింది. అలా అన్యాయంగా కేసుల్లో చిక్కుకొనే సామాన్యులకు దిక్కెవరు” అన్నది సామాజిక కోణంలో మరో ప్రశ్న. సాంకేతికంగా చూస్తే, ఆర్యన్ ను దోషిగా నిలబెట్టడానికి అప్పటి ఎన్సీబీ జోనల్ ఛీప్ సమీర్ వాంఖెడే అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం ఆయన వేరే శాఖకు బదిలీ అయ్యారు. ఆపై సరైన ఆధారాలు లేని కారణంగా ఆర్యకు క్లీన్ చిట్ లభించింది. సాంకేతిక కోణంలో ఆలోచిస్తే వాంఖెడే ఉన్న సమయంలో ఆర్యన్ ‘దోషి’, అతను వేరే శాఖకు బదిలీ అయిన తరువాత ‘నిర్దోషి’!
సరైన ఆధారాలు చూపించకుండానే ఆర్యన్ ను అరెస్ట్ చేయడం, మూడువారాలకు పైగా కటకటాల వెనక ఉంచడం ఏ మేరకు న్యాయం అని సామాజిక కోణం ప్రశ్నిస్తోంది. ఆ సమయంలో ఆర్యన్ మానసికంగా ఎంతటి క్షోభకు గురై ఉంటాడో అర్థం చేసుకోవాలనీ అన్నిటినీ శాసించే ‘మానసిక కోణం’ ఆక్రోషిస్తోంది. ఆర్యన్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేసిన వాంఖెడేను ఏ మేరకు శిక్షిస్తారు? ఈ ప్రశ్న ఇలా ఉంటే, అప్పట్లో తెలంగాణ, ముంబైలోనూ కొంతమంది సినిమా తారలను ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’కు పిలిచి మాదకద్రవ్యాల కోణంలో విచారించారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ, సరైన ఆధారాలు లేకుండానే కేవలం అనుమానంతో వారిని ఎన్సీబీ కి రప్పించుకొని విచారించడం ఎంతవరకు సబబు అని సామాజిక కోణం ప్రశ్న! సినిమా తారలు అనగానే జనాల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. వారు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావడం కూడా సమాజంలో వారిపై దుష్ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. దాంతో జనాల్లో ఎంతో అభిమానం సంపాదించుకున్న తారల ప్రభ కొడిగొట్టే ఆస్కారమూ ఉంటుంది. ఈ కోణంలో విచారణకు హాజరయ్యే వారి మానసిక పరిస్థితి ఆందోళనకు గురికాక తప్పదు. వారికి క్లీన్ చిట్ లభించే వరకూ ప్రజల్లో చర్చోపచర్చలు సాగుతూఉంటాయి. అదే సమయంలో తారల్లో మానసిక క్షోభ కూడా చోటు చేసుకుంటుంది. వారిని విపరీతంగా అభిమానించేవారు సైతం మానసిక క్షోభకు గురికాకుండా ఉండలేరు.
ఈ కోణాలన్నిటిలోనూ యోచించి, ఇక ముందయినా సమాజంలో పేరున్న వారిని ‘ఎన్.సి.బి.’ విచారించే ముందు వారి ఇమేజ్ కు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వారున్న దగ్గరకే వెళ్ళి రహస్యంగా విచారించాలి. ఒకవేళ సరైన ఆధారాలు లభిస్తే నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం ఎవరినైనా శిక్షించవలసిందే! కానీ, ఎంతో కఠినతరమైన యాక్ట్ గా పేరొందిన నార్కోటిక్స్ యాక్ట్ తలచుకొని విచారణకు హాజరయిన వారు మానసిక క్షోభకు గురయ్యే ఆస్కారం ఉంది. తప్పు చేయనివారు ఎందుకు భయపడాలి? అంటూ అధికారులు అనవచ్చు. తప్పు చేయకుండానే ఆర్యన్ జైలులో ఉండాల్సి వచ్చింది కదా! మరి దానికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? క్లీన్ చిట్ ఒక్కటే సరిపోదు. ‘సారీ’ చెప్పినా సరిసమానం కాదు. అందువల్ల విచారించే ముందే తగిన చర్యలు తీసుకొని, ఆధారాలు లభించిన తరువాతే అరెస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో నార్కోటిక్ సంస్థ, ప్రభుత్వం ఆలోచిస్తే సముచితంగా ఉంటుంది.
