Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!

Shah Rukh Khan 300kb

Shah Rukh Khan 300kb

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఆ తర్వాత మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా భారీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే అట్లీతో మరోసారి చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తుండగా, సుకుమార్, ప్రశాంత్ నీల్ పేర్లు కూడా తెరపైకి వస్తుండటంతో ఇంతకీ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనే చర్చ అయితే జోరుగా సాగుతోంది.

2023లో ‘జవాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్‌కు అట్లీ ఇచ్చిన సక్సెస్ ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ప్రభావం చూపడంతో వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అట్లీ కూడా గతంలో షారుఖ్‌తో మళ్లీ పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే అది ‘జవాన్ 2’ అవుతుందా లేదా పూర్తిగా కొత్త కథ అవుతుందా అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ హీరోగా ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత షారుఖ్‌తో చేతులు కలిపే అవకాశం ఉందనే ప్రచారం బాలీవుడ్, సౌత్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఇచ్చిన రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ కాంబినేషన్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడే అవాకాశం ఉంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కూడా షారుఖ్ ఖాన్ సినిమా చేసే అవకాశం ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ ఫ్రాంచైజ్ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. షారుఖ్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సుకుమార్ సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే మొదలైంది. అయితే ఈ కాంబినేషన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదని చెప్పాలి.

మరోవైపు ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ పేరు కూడా షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లిస్ట్‌లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. ఆ తర్వాత షారుఖ్‌తో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘కింగ్’పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ‘పఠాన్’, ‘జవాన్’ తర్వాత తన సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న షారుఖ్.. ఇకపై బాలీవుడ్‌తో పాటు సౌత్ దర్శకులతోనూ భారీ స్కేల్‌లో సినిమాలు చేయాలని చూస్తున్నట్లు ఈ వరుస రూమర్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే వీటిలో ఏ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుందో తెలియాలంటే ఆఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.