NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు.
ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది. గర్వంతో ఛాతీ విప్పారుతుంది. చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ తెలుగునాట ఎన్టీఆర్ స్థాయిలో చరిత్ర సృష్టించిన వారు మరొకరు కానరారు. 1949 నవంబర్ 24న విడుదలైన ‘మనదేశం’ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. అందులో ఆయన పాత్ర నిడివి తక్కువే. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా పనిచేసే పాత్రలో స్వదేశీయులనే చావగొట్టే పాత్ర ఆయనది. ఆ పాత్రలో ఎన్టీఆర్ లీనమై నటించిన తీరు చిత్రసీమలోని వారిని ఆకర్షించింది. ‘మనదేశం’ విడుదలయ్యాక జనాన్నీ ఆకట్టుకుంది ఆ పాత్ర. ఆ తరువాత ‘షావుకారు’లో తొలిసారి తెరపై కథానాయకునిగా కనిపించిన ఎన్టీఆర్ ‘పాతాళభైరవి’ కోసం సాహసం చేసిన తోటరాముడుగానూ మురిపించారు. దాంతో సూపర్ స్టార్‌గా నిలిచారు. మరి వెనుదిరిగి చూసుకోని ఎన్టీఆర్ నటజీవితంలో ఎన్నెన్నో మరపురాని, మరచిపోలేని విలక్షణమైన పాత్రలు జనం ముందు నిలిచి వారి మదిని గెలిచాయి.
ఆ దేవుడెలా ఉంటాడో తెలియని భారతీయులకు ఎన్టీఆర్ పోషించిన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శివుడు, సత్యనారాయణ స్వామి వంటి పాత్రలే నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. పౌరాణిక, జానపదాల్లో అనితరసాధ్యంగా నటించిన ఎన్టీఆర్ సాంఘికాల్లోనూ, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయాలకు, నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగిన సక్సెస్‌కు కొదువే లేదు. ఆయన చిత్రాలు నెలకొల్పిన రికార్డులు ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటేనే ఎన్టీఆర్ స్టార్ డమ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అనేక విలక్షణమైన పాత్రలలో జీవించి, అలరించారు రామారావు. ముఖ్యంగా పేదవాడి పక్షం నిలచి పోరాడే నాయకునిగా నటరత్న అభినయం సామాన్యులను ఇట్టే ఆకట్టుకుంది. దాంతో రామారావు తమకోసమే జనించాడనీ ఎందరో భావించారు.
తమ గుండె గుడిలో తనను ఆరాధిస్తున్న సామాన్యుల కోసం ఏదైనా చేయాలి అనే సత్సంకల్పంతోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. 1982 మార్చి 29న తన మాతృభాషను స్మరిస్తూ ‘తెలుగుదేశం’ పార్టీని నెలకొల్పారు ఎన్టీఆర్. కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో తెలుగునేలపై పర్యటించి, 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. జనవరి 9వ తేదీన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ పదవీచ్యుతిడిని చేసినప్పుడు, కేవలం మాసం రోజుల్లో ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలపడంలో ప్రజలు సాగించిన పోరాటం ఓ చరిత్రగా నిలచింది. 1984లో తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్లమెంట్ లో ప్రతిపక్షంగా నిలిచేలా చేసిందీ ఎన్టీఆర్ కరిజ్మానే. వరుసగా 1983, 84, 85 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత కూడా రామారావు సొంతమే. 1994లో ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్షహోదాకు కూడా అర్హత సాధించని విధంగా ఓడించిందీ ఎన్టీఆరే. ఇంతటి అపూర్వ విజయాలు సాధించిన ఎన్టీఆర్ తెలుగువారయినందుకు అందరూ గర్వించారు. అందుకే ఆయనను సదా స్మరించుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మరింతగా ఆయనకు నివాళులు అర్పించనున్నారు జనం.
(జనవరి 18న నటరత్న ఎన్టీఆర్ వర్ధంతి)