Site icon NTV Telugu

Senior Naresh: అందుకే థియేటర్లకు జనాలు రావడం లేదు

Senior Naresh On Theatres

Senior Naresh On Theatres

Senior Naresh Tweets On Theatre Management Charges: జూన్, జులై నెలల్లో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో.. జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే, అవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయని కొందరు అభిప్రాయపడ్డారు. జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారని, మునుపటిలా థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కూడా అన్నారు. కానీ.. కంటెంట్ ఉంటే జనాలు థియేటర్లకు తరలి వస్తారని బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు నిరూపించాయి. థియేటర్లకు జనాలు రాకపోవడానికి ఓటీటీలు కారణం కావని ఆ చిత్రాలు చాటి చెప్పాయి. ఇలాంటి తరుణంలో.. సీనియర్ నటుడు నరేశ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాలు థియేటర్‌కి రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని ట్విటర్ మాధ్యమంగా తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.

‘జనాలు థియేటర్లకు రాకపోవడానికి కారణం, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటమే కాదు. పెప్సీ, పాప్ కార్న్ వంటి స్నాక్స్ ధరలు కూడా ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. రూ. 20 లేదా రూ. 30 విలువ చేసే పెప్సీ, పాప్‌కార్న్‌లను రూ. 300 కి అమ్ముతున్నారు. ఈ ఖర్చులతో కలుపుకొని, ఒక మధ్య తరగతి కుటుంబానికి ఓ సినిమా చూడాలంటే.. మొత్తంగా రూ. 2500 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. జనాలు కేవలం సినిమా చూడాలని కాదు, మంచి థియేటర్ అనుభూతిని కూడా పొందాలని అనుకుంటారు. దీనిపై ఒకసారి ఆలోచించండి’’ అంటూ ఒక ట్వీట్‌లో చెప్పారు. మరో ట్వీట్‌లో.. ఇంతకుముందు ఒక యావరేజ్ సినిమా కూడా వారం రోజుల వరకు ఆడేదని, కానీ ఇప్పుడు రెండో రోజు థియేటర్లు నిండాలంటే అది ఒక గొప్ప సినిమా అయ్యుండాలని అన్నారు. ప్రతీదీ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాగా తీర్చిదిద్దలేం కాబట్టి.. థియేటర్స్‌లోని స్నాక్స్ ధరలు కూడా తగ్గిస్తే, జనాలు సినిమాలు చూసేందుకు వస్తారని నరేశ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version