టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు.
టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాద్ లో టబు జన్మించారు. విజయనగర్ కాలనీలోని సెయింట్ యాన్స్ హైస్కూల్ లో పదో తరగతి చదివిన టబు, తరువాత ముంబయ్ చేరి, అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో ప్లస్ టూ పూర్తి చేశారు. హైదరాబాద్ లో చదువుతూ ఉండగానే టబు, స్మితాపాటిల్ నటించిన ‘బజార్’లో బాలనటిగా నటించింది. అది కాగానే 1985లో దేవానంద్ తెరకెక్కించిన ‘హమ్ నౌజవాన్’లో టీనేజ్ గాళ్ గా నటించి మురిపించింది. అయితే టబు నాయికగా నటించిన తొలి చిత్రం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘కూలీ నంబర్ 1’. అందులో ఆమె పేరు స్వాతి అని ప్రకటించారు. టబు అక్క ఫరా కూడా అంతకు ముందే హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించారు. ఆమె కూడా వెంకటేశ్ సరసన ‘విజేత విక్రమ్’లో నాయికగా కనిపించారు. తొలి సినిమా ‘కూలీ నంబర్ వన్’లోనే టబు తన అందాల ఆరబోతతో కుర్రకారును కిర్రెక్కించింది. మహానటి షబానా ఆజ్మీ కూడా టబుకు సమీపబంధువు.
టబు ఉత్తరాదికి వెళ్ళి హిందీ చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆరంభంలో అక్కడ పలు పరాజయాలే ఆమెను పలకరించాయి. అజయ్ దేవగణ్ సరసన నటించిన ‘విజయ్ పథ్’మంచి పేరు సంపాదించి పెట్టింది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన తొలి చిత్రం ‘సిసింద్రీ’లో టబు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఆ తరువాత అదే నాగ్ సరసన నాయికగా ‘నిన్నే పెళ్ళాడతా’లో నటించారు టబు. ఆ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్ హిట్ అని చెప్పవచ్చు. అదే యేడాది గుల్జార్ తెరకెక్కించిన ‘మాచిస్’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు టబు. తమిళంలో ఆమె నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో అనువాదమై అనూహ్య విజయం సాధించింది. ‘చాందినీ బార్’తోనూ టబు మరోమారు ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
టబు నటించిన “విరాసత్, బోర్డర్, చాచీ 420, హు తు తు, తక్షక్, చాందినీ బార్, మక్బూల్, చీనీ కుమ్, హైదర్, అంధాదున్”వంటి చిత్రాలు మంచి ఆదరణ చూరగొన్నాయి. ఇక తెలుగులో నాగార్జున సరసన ‘ఆవిడా మా ఆవిడే’లోనూ, బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి, పాండురంగడు’ చిత్రాలలోనూ, చిరంజీవి జంటగా ‘అందరివాడు’లోనూ నటించి మెప్పించారు టబు. “షాక్, ఇదీ సంగతి” చిత్రాలలోనూ టబు కనిపించారు. గత సంవత్సరం విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో హీరోకు తల్లిగా నటించిన టబు, ఆ సినిమాలోనూ తనదైన బాణీ పలికించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం “భూల్ భులయ్యా -2, భీష్మ పర్వమ్, ఖుఫియా” చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో ‘భీష్మ పర్వమ్’ మళయాళ సినిమా. మరి ఈ చిత్రాలతో టబు ఏ రీతిన జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.
