‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత నుంచీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ శాతం స్టార్ హీరోస్ తో భారీ చిత్రాలే రూపొందాయి. అడపా దడపా ‘పదహారేళ్ళ వయసు’, ‘నిండునూరేళ్ళు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. అలా రాఘవేంద్రరావు రూపొందించిన ‘సత్యభామ’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘మౌనగీతంగల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసరసా మూవీస్ పతాకంపై కె.సారథి ‘సత్యభామ’ను నిర్మించారు.
‘సత్యభామ’ కథను చూస్తే – పెళ్ళయి ఏడేళ్ళు పూర్తయిన ఏ మగాడికైనా రిమ్మతెగులు పుడుతుందనే సామెత గుర్తుకు వస్తుంది. ఆ సామెతను ఆధారం చేసుకొనే 1955లో ‘ద సెవెన్ ఇయర్ ఇచ్’ అనే చిత్రం రూపొందింది. ఇందులోనూ ప్రధానాంశం అలాగే ఉన్నా, ఈ చిత్రానికి జయకాంతన్ రాసిన ‘ఉన్మై సుడుమ్’ అనే చిన్న కథ ఆధారం అని భాగ్యరాజ్ చెప్పారు. అలాగే ఈ కథ యథార్థంగా జరిగిందనీ ఆయన తెలిపారు.
ఇక అసలు కథ ఏమిటంటే – హీరో, హీరోయిన్ ఇద్దరూ ఓ ఉద్యోగానికి వెళతారు. హీరో క్వాలిఫికేషన్స్ తనకంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అతనికే ఆ ఉద్యోగం వస్తుందని నాయిక భావిస్తుంది. దాంతో ఆ ఉద్యోగం ఎప్పుడో తనకు వచ్చేసిందని, తరువాత ఖాళీలు పడే అవకాశం ఉందని, అప్పుడు మీ పేరు చెబుతానని అంటుంది. దాంతో హీరో ఆమెను ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. నిజంగానే ఆ కంపెనీలో ఓ పోస్ట్ ఖాళీ అవుతుంది. అది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. దానికి హీరో సెలెక్ట్ అవుతాడు. అక్కడ హీరోయిన్ మేనేజర్. అంతకు ముందు హీరోయిన్ తనకు చేసిన మోసం తొందరగానే తెలుసుకుంటాడు హీరో. కోపం వచ్చినా, మెల్లగా ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. ఆమె కూడా అతని ప్రేమలో పడిపోతుంది. పెళ్ళిచేసుకుంటారు. హీరోయిన్ ఉద్యోగం వదిలేసి ఇల్లాలిగా ఇంటిపట్టునే ఉంటుంది. అయితే భర్తకు ఓ కండిషన్ పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు దారుల్లో నడవరాదన్నదే ఆ షరతు. హీరోయిన్ ఫ్రెండ్ ఒకామె భర్త చనిపోతే, ఆమెకు రావలసిన ధనం విషయంలో సాయం చేస్తాడు హీరో. ఓ రోజు అనుకోకుండా హీరోయిన్ ఫ్రెండ్ తో మంచం పంచుకుంటాడు హీరో. ఈ విషయం హీరోయిన్ తెలుసుకొని అతనితో కాపురం చేయలేనంటూ విడాకులు ఇస్తుంది. ఐదేళ్ళ తరువాత తన కొడుకుతో మద్రాసు చేరుకుంటుంది హీరోయిన్. అక్కడ ఆమె ఆఫీసులో హీరోయే ఆమె బాస్. దాంతో రాజీనామా చేయాలనుకుంటుంది. తన కొడుకును చూసి హీరో ఆనందిస్తాడు. అతనితో పరిచయం పెంచుకుంటాడు. తండ్రీకొడుకులు ఎంచక్కా బయట షికార్లు చేస్తూఉంటారు. ఇది తెలిసిన నాయిక, హీరోని నిలదీస్తుంది. ఆమెకు 30 రోజులు టైమ్ ఇస్తాడు. ఆ లోగా మనసు మార్చుకొని తన దగ్గరకు రమ్మంటాడు. ఈ 30 రోజుల్లో ఆమెకు భర్త ఇన్నాళ్ళు వేరే ఎవ్వరినీ పెళ్ళాడకుండా తన కోసమే వేచి ఉన్నాడన్న నిజం తెలుస్తుంది. అలాగే తన తండ్రి కుటుంబానికి కూడా ఓ అల్లునిగా అతను సాయం చేశాడనీ తెలుసుకుంటుంది. అయితే ఈ లోగా ఆఫీసులో ఆమెకు ఎంతో నమ్మకంగా ఉన్న ఓ వ్యక్తి, ఆమెతో తనకు సంబంధం ఉందని చెబుతాడు. అది నిరూపించడం కోసం ఆమె కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పి, ఓ చోటకు రమ్మంటాడు. అక్కడకు హీరోయిన్ వెళ్తుంది. అక్కడికి చేరుకున్న ఆఫీసులోని సహ ఉద్యోగులు ఆమెను గేలి చేస్తారు. అప్పుడు హీరో వచ్చి, ఆమె నిప్పులాంటిదని, ఎవరినీ కనీసం తాకనీయదని చెబుతాడు. దాంతో అందరూ ఖంగు తింటారు. ఆ ప్లాన్ వేసిన వాడికి హీరో దేహశుద్ధి చేయడంతో వాడు నిజం ఒప్పుకుంటాడు. భర్త మంచితనం అర్థం చేసుకొని 30 రోజులు పూర్తయిన కారణంగా అతనికి ముఖం చూపించలేక హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆమె కొడుకు వచ్చి వారిస్తాడు. చివరకు భర్తనే నాయిక మళ్ళీపెళ్ళిచేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ నాయకానాయికలు కాగా, మిగిలిన పాత్రల్లో అల్లు రామలింగయ్య , కాంతారావు ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కథకు సత్యానంద్ మాటలు రాశారు. చక్రవర్తి సంగీతానికి తగ్గ పాటలను వేటూరి పలికించారు. “శివరాత్రి ఉపవాసం హరీ హరీ…”, “సిసలైన తెలుగింటి ఓ రామచిలకా…”, “ముత్యాల ముంగిటిలో…పగడాల పల్లకిలో…”, “డాడీ డాడీ ఓ మై డాడీ…” పాటలు ఎంతగానో అలరించాయి.
భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘మౌన గీతంగల్’ చిత్రం 1981 జనవరిలో విడుదల కాగా, ఈ కథ ఆధారంగా తెలుగులో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సత్యభామ’, హిందీలో తాతినేని రామారావు దర్శకత్వంలో ‘ఏక్ హీ భూల్’ ఒకే సమయంలో రూపొందాయి. అయితే ‘ఏక్ హీ భూల్’ 1981 అక్టోబర్ 9న విడుదల కాగా, అదే నెల 31న ‘సత్యభామ’ జనం ముందు నిలచింది. ఆ హిందీ సినిమా, మన తెలుగు చిత్రం రెండూ సక్సెస్ రూటులోనే సాగాయి. రీమేక్స్ లో యథాతథంగా కథను తీసుకోకపోయినా, ప్రధానాంశం అలాగే నిలచింది. ఇక ఇదే కథ మళయాళంలో ‘చంచాట్టం’గానూ, కన్నడలో ‘మనే దేవ్రు’గానూ రూపొందింది.