Site icon NTV Telugu

Social Media : జాగ్రత్త బాసూ.. నేటి పోస్టే రేపు కాలనాగై కాటేసునేమో?

Social Media Sarcastic Post

Social Media Sarcastic Post

Sarcastic Posts in Social media by Directors: కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని తరచూ మనం వింటూనే ఉంటాం. ఇది సరదాగా చెప్పే మాటే కానీ ఇందులో చాలా గూడార్థం ఉంది. అసలు విషయం ఏమిటంటే ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన కొన్ని ట్వీట్లను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి ఆయన దుమ్ము దులిపి పారేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి ఆయన చేసిన ట్వీట్ ఒకటి. సుమారు 8 ఏళ్ల క్రితం ఒకానొక హనుమాన్ జయంతి సందర్భంగా ఓం రౌత్ కి చిరాకు వచ్చింది. దానికి కారణం ఆయన ఇంటి చుట్టుపక్కల ఉండేవారు హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్లలో పాటలు ప్లే చేయడమే. ఈ సందర్భంగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆంజనేయస్వామికి చెముడు ఉందా? మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే భావిస్తున్నట్టున్నారు, అందుకే పెద్ద సౌండ్ తో పాటలు పెట్టి వాయించేస్తున్నారు, అవి కూడా ఏమాత్రం సంబంధం లేని పాటలు అంటూ అప్పట్లో ట్వీట్ చేశాడు. బహుశా ఈ ట్వీట్ చేసిన సంగతి కూడా రౌత్ కి గుర్తులేదు. కానీ ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ట్వీట్ ని వెతికి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Upasana Konidela: కొణిదెల ఇంట మూడో తరం రాకకు రేపే శుభముహూర్తం.. పూజలు చేయాలని అభిమానులకు పిలుపు!
ఆంజనేయస్వామి నీచంగా మాట్లాడిన నువ్వు ఈరోజు ఆది పురుష్ అనే ఒక సినిమా చేసినంత మాత్రాన మీ పాపాలు పోతాయి అనుకుంటున్నావా? అంటూ టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టు అప్పట్లో షారుఖ్ నటించిన ఫ్యాన్ అనే సినిమాని ఒక మరాఠీ సైరత్ సినిమాతో పోలుస్తూ ఆ రెండు సినిమాలకు కలెక్షన్ల మధ్య తేడా వర్ణిస్తూ చేసిన ట్వీట్ కూడా కలకలం రేపగా దాన్ని కూడా ఆయన డిలీట్ చేసుకున్నాడు. అలాగే ధోనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా ఇలాగే వెటకారంగా చేసినట్టుగా సోషల్ మీడియాలో తెర మీదకు వచ్చింది. గతంలో కూడా తెలుగులో మాచర్ల నియోజకవర్గం అనే సినిమాని రాజశేఖర్ రెడ్డి అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. నితిన్ హీరోగా ఈ సినిమాని ఆయన తొలిసారి డైరెక్ట్ చేశారు. గతంలో ఎడిటర్ గా కొన్ని సినిమాలకు పని చేసిన ఆయన ఆ సినిమాతోనే డైరెక్టర్గా మారాడు. అప్పట్లో ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ మరొక పార్టీని ఒక కులాన్ని కూడా కించపరిచే విధంగా ట్వీట్లు ఉన్నాయి అంటూ అతని ట్విట్టర్ అకౌంట్ గురించి కూడా చర్చ జరిగింది.
Adipurush: నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి.. పోలీసులకు ‘ఆదిపురుష్’ రైటర్ విజ్ఞప్తి!
ఆ తర్వాత అది తన ట్విట్టర్ అకౌంట్ కాదని కావాలని ఎవరో ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే వయసులో చిన్నగా ఉన్నప్పుడు లేదా వారి వారి బాధ్యతలు ఎక్కువగా లేనప్పుడు ఇతర విషయాల మీద నోరు పారేసుకోవడం సర్వసాధారణంగా జరిగే విషయమే. కానీ సినిమా లేదా ఇతర రంగాలలో ఎదుగుతున్న క్రమంలో గతంలో చేసిన ఇలాంటి తప్పులను క్లియర్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఎందుకు అసలు తప్పు మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తే ఇలాంటి బాధలు కూడా భవిష్యత్తులో పడాల్సిన అవసరమే ఉండదు కదా. ఈ ఇద్దరు దర్శకుల వ్యవహారాలు మనకు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి, ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికగా దుర్భాషలకు దిగేవారు తాము ఫ్యూచర్లో ఏమవుతామో అని ఏమాత్రం సోయ లేకుండా ఇష్టం వచ్చిన విధంగా ఒక వర్గాన్ని, ఒక హీరోను, లేక ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ నోళ్లు అదేనండీ మీ సోషల్ మీడియా అకౌంట్లను అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు.

Exit mobile version