Hero Sanjosh : సినిమాల్లో నటిస్తూనే సామాజిక బాధ్యతను చాటుకుంటున్న యంగ్ హీరో సంజోష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌కు చెందిన దృష్టిలోపం ఉన్న అమ్మాయిల సమక్షంలో ఆయన రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ అమ్మాయిల అవసరాల కోసం ఒక గ్యాస్ స్టవ్‌ను బహూకరించడంతో పాటు, వారందరికీ ప్రత్యేకంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. “ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే.. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నా వంతుగా ఎప్పుడూ అండగా ఉంటాను” అని సంజోష్ వారికి భరోసానిచ్చారు. గతంలో కూడా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలకు రెండు సార్లు భోజనాలు అందించడంతో పాటు ఒక ఫ్రిజ్‌ను కూడా విరాళంగా ఇచ్చారు.
సంజోష్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు
వరంగల్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంజోష్, ‘సంజోష్ ఫౌండేషన్’ స్థాపించి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా 250 మందికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడమే కాకుండా, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించారు. అంతేకాకుండా ముగ్గురు విద్యార్థుల చదువు పూర్తి బాధ్యతను ఆయనే స్వయంగా స్వీకరించారు. “చిన్న చిన్న పనులైనా గొప్ప ప్రేమతో చేయాలి” (Small Things, With Great Love) అనే నినాదంతో సమాజానికి తిరిగి సేవ చేస్తున్న సంజోష్‌ను పలువురు అభినందిస్తున్నారు.

