Site icon NTV Telugu

మంత్రి అనిల్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు కామెంట్స్

సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసేందుకే ఆన్ లైన్ సినిమా టికెట్లను తీసుకొస్తోందంటూ పవన్ చేసిన విమర్శలపై మంత్రులు ఇవాళ ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు.

మంత్రి అనిల్ మాట్లాడుతా.. ‘టికెట్లు ఆన్‌లైన్‌ లో అమ్మితే తప్పేంటి..? మాకు సంపూర్ణేష్‌ బాబు అయినా… పవన్‌ కళ్యాణ్‌ ఒక్కటే. వైసీపీ నేతలపై ట్రోలింగ్ చేయడానికే పవన్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. ఎంత ట్రోలింగ్‌ చేసుకుంటారో చేసుకోండి. ఆన్లైన్ టికెట్ల గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వంతో చర్చించారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం ? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి ? అని మంత్రి అనిల్ ప్రశ్నించారు.

తాజాగా మంత్రి అనిల్ వ్యాఖ్యలపై నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు. ‘మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.’ అని సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు.

Exit mobile version