Sambarala Yeti Gattu: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. భారీ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న చిత్రాల నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ కూడా అలాంటి అంచనాల మధ్య ముందుకు సాగుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన సంగ్రహావలోకనం గ్లింప్స్ భారీ స్పందనను రాబట్టుకుని హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. తాజాగా చిత్రబృందం మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన క్లైమాక్స్ సీన్స్ కు సంభందించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేయడం జరిగిందని, క్లైమాక్స్‌తో పాటు కీలక యాక్షన్ సన్నివేశాలను అత్యంత గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు ఈ సెట్‌ను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తికావచ్చింది. త్వరలనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా ప్రారంభించేందుకు కూడా చిత్రబృందం సిద్ధమవుతోంది.
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాణ వ్యయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ యాక్షన్, ఎమోషన్, భారీ విజువల్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఆయన పేరు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో భారీ బడ్జెట్, బలమైన కథ, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ కూడా ఆ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. డిసెంబర్ 2026లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి షెడ్యూల్ ప్రారంభం కావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. విడుదలకు ముందు మరిన్ని పబ్లిసిటీ స్టంట్స్ తో చిత్రబృందం అంచనాలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

