సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘రిపబ్లిక్’ మూవీ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా తమ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే… అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.
Read Also: గూజ్ బంబ్స్ తెప్పించిన ‘భీమ్లా నాయక్’
పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘రిపబ్లిక్’ను దేవా కట్ట తెరకెక్కించారు. కెరీర్ ప్రారంభంలోనే దేవా కట్ట సమకాలీన రాజకీయాలపై రూపొందించిన ‘ప్రస్థానం’ దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే సినిమా ఇటీవల హిందీలోనూ రీమేక్ అయ్యింది. ఇప్పుడు భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల నేపథ్యంలో ‘రిపబ్లిక్’ను దేవా కట్ట తీశారు. ఇందులో పంజా అభిరామ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను సాయితేజ్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే తన ఇంటిపేరును తొలిసారి సాయితేజ్ తన పాత్రకు పెట్టుకున్నాడు. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలలో పంజా అభిరామ్ అత్యంత ఇష్టమైనదని తేజ్ చెబుతున్నాడు. ఐశ్వర్యా రాజేశ్ నాయికగా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
