Happy Birthday: ప్రముఖ నటుడు శ్రీకాంత్ తెలుగుతో పాటు ఈ యేడాది తమిళంలోనూ తన సత్తాను చాటాడు. విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’లో సోదరుడి పాత్ర పోషించి, మెప్పించాడు. ఇదిలా ఉంటే… శ్రీకాంత్ నట వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు రోషన్ మేకా. బాలనటుడిగా 2015లో ‘రుద్రమదేవి’లో నటించిన రోషన్, ఆ తర్వాత సంవత్సరమే… టీనేజ్ లవ్ స్టోరీ ‘నిర్మలా కాన్వెంట్’లో నటించాడు. ఆ సినిమాకు గానూ ఉత్తమ నూతన నటుడిగా సైమా అవార్డునూ అందుకున్నాడు. కాస్తంత విరామం తీసుకుని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి తెరకెక్కించిన ‘పెళ్ళిసందడి’లో రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ద్వారానే శ్రీలీల హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నటుడిగా వెండితెరపై అడుగుపెట్టడానికి ముందే రోషన్ ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, నటననే కాదు… క్రికెట్ నూ స్వీకరించిన రోషన్ ప్రస్తుతం సి.సి.ఎల్. లో హైదరాబాద్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. విశేషం ఏమంటే… సోమవారం అతని పుట్టిన రోజు సందర్భంగా తాజా చిత్రాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. వేదాంస్ పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రావ్ ఎర్రబెల్లి నిర్మిస్తున్న చిత్రంలో రోషన్ నటిస్తున్నాడు. దీనికి సోనాలి నారంగ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. అలానే వైజయంతి మూవీస్ లోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు రోషన్ తెలిపాడు.
