NTV Telugu Site icon

రివ్యూ: రొమాంటిక్

ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

గోవాకు చెందిన ఓ పోలీస్ అధికారి (భరత్ రెడ్డి) కొడుకు వాస్కోడిగామా. అతని తల్లిదండ్రులను గ్యాంగ్ స్టర్స్ కాల్చేయడంతో నానమ్మ మేరీ (రమాప్రభ) దగ్గర పెరుగుతాడు. చిన్నప్పటి నుండి కష్టాలను కాచివడపోసిన వాస్కోడిగామాకు జీవితంలో ఒకటే కోరిక. గోవాలో తనో పెద్ద గ్యాంగ్ స్టర్ అయిపోవాలని, కోట్లు కొల్లగొట్టి తనలా బీదరికం అనుభవిస్తున్న వాళ్ళందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని. అలాంటి కుర్రాడి జీవితంలోకి ప్రేమపాశంతో మోనిక (కేతిక శర్మ), యమపాశంతో రమ్య గోవార్కిర్ (రమ్యకృష్ణ) అడుగుపెడతారు. దాంతో ఈ కుర్ర గ్యాంగ్ స్టర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే మిగతా కథ.

పూరి స్టోరీ అనగానే ఆడియెన్స్ లో కొన్ని రకాల అంచనాలు ఉంటాయి. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. ఫాదర్ లేదా మదర్ సెంటిమెంట్. పైలా పచ్చీసుగా తిరిగే ఆ కుర్రాడికి పడిపోయే ఓ పిచ్చిమాలోకం లాంటి అమ్మాయి. ఆమె వెనుకో చిన్నకుటుంబం. ఇది కామన్! అయితే నేపథ్యమే కాస్తంత అటూ ఇటూ మారుతుంది. ఈ సినిమాలో గోవా గ్యాంగ్ స్టర్స్ ఎలిమెంట్ ను పూరి బ్యాక్ డ్రాప్ గా చేసుకున్నాడు. ‘రొమాంటిక్’ అనే టైటిల్ పెట్టినందుకు హీరో కు హీరోయిన్ కు మధ్య ప్రేమో, మోహమో, కామమో తెలియని ఏదో ఓ బంధమైతే సాగుతూ ఉంటుంది. తన జీవితంలోకి ఆడవాళ్ళకు ప్రవేశం లేదనే ఈ గ్యాంగ్ స్టర్ చివరకు తన ఆశయాన్ని కూడా పక్కన పెట్టేసి, ఓ అమ్మాయి కోసం ప్రాణాలిచ్చేయడానికి రెడీ అయిపోతాడు. పోనీ ఆ ప్రేమలోని గాఢతను అయినా కన్వెన్సింగ్ గా చూపించారా అంటే అదీ లేదు! నాలుగైదు పాటలను, మాటల్లాంటి ఓ వచన కవిత్వాన్ని హీరోహీరోయిన్ల మీద తీసేసి, వాళ్ళ బిగి కౌగిలింతలు, వేడి నిట్టూర్పులు, గాఢ చుంబనాలలో ఆ ప్రేమను వెత్తుకోమనే పరీక్ష పెట్టారు.

‘రొమాంటిక్’ అనే ఈ సినిమాలో రొమాన్స్ పేరుతో చూపించిన వల్గారిటీ కంటే యాక్షనే ఎక్కువ. ఎందుకంటే ఈ కథంతా గోవాలో జరిగే స్మగ్లింగ్ మీదనే సాగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్య ఉన్న గొడవలతో హఠాత్తుగా వాస్కో ఓ వర్గానికి లీడర్ కావడం, అతనికి ఆ ముఠా సభ్యులు వత్తాసు పలకడం, పోలీసుల ఎన్ కౌంటర్… ఇవన్నీ చకచకా సాగిపోతాయి. కానీ అంతకు మించి కథ ముందుకు వెళ్ళదు. కళ్ళ ముందు కనిపిస్తే కాల్చేయాలనేంత కసి వాస్కో మీద రమ్య గోవార్కిర్ కు ఉన్నా ఆమె ఆ పని మాత్రం చేయలేదు. దాంతో క్లయిమాక్స్ అరుపులు, కేకలు, బుల్లెట్ల చప్పుళ్ళతో చెవులు చిల్లులు పడేలా చేస్తుంది. కాకపోతే, పోలీస్ అధికారి రమ్యను వాస్కో షూట్ చేయకపోవడానికి కారణం మాత్రం పూరి కన్వెన్సింగ్ గా చెప్పాడు. ‘డ్యూటీనే నా రెలిజియన్’ అనే తండ్రి మాటను రమ్య నోటితో పలికించి వాస్కో నిస్సహాయతకు సహేతుకమైన కారణం చూపించాడు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది! థియేటర్ లో జనం గుండె భారమైపోతుంది!!

నటీనటుల విషయానికి వస్తే ఆకాశ్ పూరికి తగిన పాత్ర కాదు ఇది. ఇలాంటి పాత్రలు చేయడానికి మరో మూడు నాలుగేళ్ళైనా అతను వేచి చూడాలి. లవ్ స్టోరీలు జనం చూడకపోతే, భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవాలి తప్పితే ఇలా రొట్టకొట్టుడు కధలతో కాలయాపన చేయకూడదు. ఆకాశ్ పాత్రకు అతని బేస్ వాయిస్ బాగా పనికొచ్చింది. కళ్ళు మూసుకుని వింటే పూరి మాట్లాడుతున్నటే అనిపించింది. డెబ్యూ హీరోయిన్ కేతిక శర్మ తెరమీద అందంగానే ఉంది. అంతకు మించి ఆమె నుంచి పెద్ద నటనను మనం ఎక్సెప్టెక్ట్ చేయలేం. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ రమ్యకృష్ణ. ఎక్కడా టెంపో తగ్గకుండా ఆమె పాత్రకు చక్కని గ్రాఫ్ మెయిన్ టైన్ చేశారు. ఉత్తేజ్, సునైన జంట బాగుంది. రమాప్రభ ఈ వయసులోనూ బామ్మ పాత్రలో బాగానే నెట్టుకొచ్చేసింది. మకరంద్ దేశ్ పాండే లోని నటుడిని పెద్దంతగా ఉపయోగించుకోలేదు. ఇతర పాత్రల్లో ఖయ్యూమ్, నవీన్, రవి, ప్రభావతి, ప్రీతినిగమ్ తదితరులు కనిపిస్తారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్, నరేశ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. పూరి మార్క్ డైలాగ్స్ సహజంగా ఉండి, అక్కడక్కడా బాగానే పేలాయి. భాస్కరభట్ల సాహిత్యమూ బాగుంది. ఇక ‘పీనేకే బాద్’ పాటలో హీరో రామ్, పూరి జగన్నాథ్ స్పెషల్ అప్పీయిరెన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుంది. ఏదేమైనా కొత్తదనం లేని ‘రొమాంటిక్’ను భరించడం కాస్తంత కష్టమే!

ప్లస్ పాయింట్స్:

రమ్యకృష్ణ నటన

సునీల్ కశ్యప్ మ్యూజిక్

నరేశ్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

కొత్తదనంలేని కథ, కథనం..

రొమాన్స్ పేరుతో చూపిన లస్ట్..!

రేటింగ్ : 2.25 / 5

ట్యాగ్ లైన్: నో రొమాన్స్ ఓన్లీ లస్ట్!

Show comments