Robbery Attempt At Mahesh Babu House: సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ప్లాన్ బెడిసికొట్టింది. తాను ఎక్కిన ప్రహరీ గోడ మరీ ఎత్తుగా ఉండడంతో, కిందకు దూకినప్పుడు అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దాంతో అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ దొంగ పేరు కృష్ణ. అతడి వయసు 30. మూడు రోజుల క్రితమే ఇతను ఒడిశా నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఓ నర్సరీ వద్ద ఉంటోన్న ఇతడు.. రాత్రికి రాత్రే సంపన్నుడు అవ్వాలన్న ఉద్దేశంతో, మహేశ్ బాబు ఇంటికి కన్నం వేయాలని ప్రయత్నించాడు.
తొలుత మహేశ్ బాబు ఇంటి వద్ద చక్కర్లు కొట్టిన ఆ దొంగ.. మంగళవారం రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారమే.. రాత్రి 11:30 గంటలకు ప్రహరీ గోడ ఎక్కాడు. అయితే.. ఆ గోడ 30 అడుగల ఎత్తు కలిగి ఉంది. అంత పై నుంచి దూకేసరికి.. దొంగకి గాయాలయ్యాయి. ఆ దొంగ పడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో.. కాలయాపన చేస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అతడు గాయాలతో పడి ఉండటం, మహేశ్ ఇంట్లో దొంగతననాకి వచ్చాడని తెలియడంతో.. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ దొంగను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు.
కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్ తల్లి ఇందిరా దేవి.. బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
