Naveen Neni: ఇద్దరు ప్రేమికులు ఒకరి గురించి మరొకరికి అన్నీ తెలుసు అనుకుని, ఇక పెళ్ళి పీటల పైకి ఎక్కడమే తరువాయి అని భావించిన టైమ్ లో వాళ్ళ ఫోన్స్ ఎక్స్ ఛేంజ్ చేసుకోవడంతో ఏం జరిగిందన్నదే ఆ మధ్య వచ్చిన ‘లవ్ టుడే’ కథ. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడా మంచి విజయాన్ని సాధించింది. ఎదుటి వారికి సంబంధించిన సీక్రెట్స్ రివీల్ కావడానికి ఫోన్ ఎక్స్ ఛేంజ్ అనేది ఓ సాధనం. అలానే మొబైల్ ఫోన్ ను లౌడ్ స్పీకర్ మోడ్ లో అందరి ముందు ఉంచితే కూడా… చాలా విషయాలు బహిర్గతమై పోతుంటాయి. అదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ‘రిచి గాడి పెళ్ళి’. ఓ సందర్భంలో కొందరు ప్రేమికులు, స్నేహితులు తమ ఫోన్ ను లౌడ్ స్పీకర్ మూడ్ లో పెట్టి చిన్న ఆట ఆడతారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలాలు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్ర కథ. మంగళవారం విడుదలైన ‘రిచి గాడి పెళ్ళి’ ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతోంది. ఇలాంటి పనులు చేస్తే ఇక కొంప కొల్లేరే అనే విషయాన్ని దర్శక నిర్మాత కె.ఎస్. హేమరాజ్ వినోదాత్మకంగా చూపించాడు.
కె. ఎస్. ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ లో ‘రిచి గాడి పెళ్లి’ మూవీని స్వీయ దర్శకత్వంలో కె. ఎస్. హేమరాజ్ నిర్మించారు. ఇందులో సత్య ఎస్.కె., నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజేంద్ర వైట్ల, నాగరాజు మడూరి కథను అందించిన ఈ సినిమాకు సత్యన్ స్వరరచన చేశారు. ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మానవ సంబంధాలకు అద్దం పట్టే ఈ సినిమాను మార్చి 3న విడుదల చేయబోతున్నారు.