బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో రియా, ఆమె సోదరుడిని అధికారులు అరెస్ట్ చేయడంతో, ఒక దశలో ఆమె జీవితం తారుమారై పోయింది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు తర్వాత ఈడీ, ఎన్సీబీ, చివరకు సీబీఐ దర్యాప్తు చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న రియాకు చివరికి సీబీఐ “నిర్దోషి” అని క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తాజాగా జరిగిన ఓ షో లో రియా మాట్లాడారు. ఆ సందర్భంలో ఆమె కన్నీటి జ్ఞాపకాలను పంచుకున్నారు..
Also Read : SSMB29 : రాజమౌళి – మహేష్ మూవీలోకి.. బాలీవుడ్ స్టార్ ఎంట్రీ?
“సీబీఐ నాకు నిర్దోషి అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. మీడియా ఎప్పుడూ తప్పు కథనాలు వండి వారుస్తుంది. అందుకే మొదట నమ్మలేదు. నా న్యాయవాది ధృవీకరించిన తర్వాత నమ్మాను. ఆ రోజు మా ఇంట్లో అందరూ ఏడ్చేశారు. నేను నా సోదరుడిని కౌగిలించుకుని చాలా సేపు విలపించాను. నా తల్లిదండ్రులను చూసినప్పుడు మన జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని గ్రహించాను” అని రియా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
2020లో రియాను NCB అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 28 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఆ కాలం తన కుటుంబానికి, తనకు చాలా కఠినమైనదని రియా గుర్తు చేసుకున్నారు. ఈ కేసు కారణంగా రియా నటిగా తన కెరీర్‌లో భారీ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. బాలీవుడ్‌లో మంచి అవకాశాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు రియా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మళ్లీ తన కెరీర్‌ను రీబిల్డ్ చేసుకుంటున్నారు.
