గత యేడాది లాగే ఈ సారి కూడా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదేలు చేసింది. అయినా కొన్ని సినిమాలు వెలుగులు విరజిమ్మాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేశాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ బరిలో మిశ్రమ ఫలితాలు చూశాయి. అందరు స్టార్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అనిపించుకున్నవారందరూ ఏదో విధంగా వినోదం పంచారనే చెప్పాలి. టాప్ హీరోస్ లో కొందరి సినిమాలు థియేటర్లలో అలరించగా, కొందరు ఓటీటీ శ్రేయస్కరమని భావించారు. అయితే ఏ సినిమా విడుదల చేయకుండానే కొందరు స్టార్స్ తమ కొత్త చిత్రాల టీజర్స్ తోనో, పాటలతోనూ పరశింపచేయడం విశేషం!
టాలీవుడ్ లో టాప్ హీరోస్ అనగానే ఈ రోజుకూ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆ నలుగురే! అసలు జనాల్లోనూ ఆ నలుగురి గురించే ముందుగా చర్చ ఉంటుంది. తరువాతే నవతరం హీరోల లెక్కల గొప్పలు సాగుతూ ఉంటాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నలుగురూ ఈ సారి రకరకాలుగా ఆకట్టుకున్నారు. ఎవ్వరు అవునన్నా కాదన్నా, ఈ నలుగురు హీరోల ముచ్చట లేకుండా టాలీవుడ్ టాక్ సాగదు. ఆ తరువాతే యంగ్ హీరోస్ వసూళ్ళ గురించి, వారు పుచ్చుకొనే పారితోషికాల ముచ్చట్లు సాగుతుంటాయి. అలా ఈ సారి కూడా ఆ నలుగురు హీరోలు రకరకాలుగా అలరించారు.
‘ఆచార్య’ సందడి!
చిరంజీవి నటించిన ఏ చిత్రమూ విడుదల కాకపోయినా, ఆయన తాజా చిత్రం ‘ఆచార్య’లోని కొన్ని పాటలు, టీజర్, చిరంజీవి, రామ్ చరణ్ లుక్స్ ఇవన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇవి సోషల్ మీడియాలో భలేగా సందడి చేశాయి. వ్యూస్ లో కొన్ని రికార్డులు కూడా సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి చిరంజీవితో తొలిసారి దర్శకుడు కొరటాల శివ పనిచేయడం కారణం కాగా, ఇందులో రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తూ ఉండడం మరో కారణం. అలాగే ఇందులో రామ్ చరణ్ కు పూజా హెగ్డే జోడీ కావడం మరింత ఆకర్షణగా నిలచింది.
అదరహో ‘అఖండ’!
బాలకృష్ణ నటించిన ‘అఖండ’ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవగా, ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచీ రికార్డ్ స్థాయి వ్యూస్ తో అభిమానులకు ఆనందం పంచాయి. ఈ సినిమాకు తొలి నుంచీ అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన బజ్ క్రియేట్ కావడానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రమిది. అంతకు ముందు ఈ కాంబోలో వచ్చిన ‘సింహా, లెజెండ్’ సాధించిన ఘనవిజయాలు, నెలకొల్పిన రికార్డుల నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి మూడో చిత్రానికి తొలి నుంచీ ‘బీబీ 3’ అనే ట్యాగ్ తో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ’ సోషల్ మీడియాలో సందడి చేయడమే కాదు, లాక్ డౌన్ తరువాత తొలి టాప్ హీరో చిత్రంగా విడుదలయింది.
డిసెంబర్ ప్రథమార్ధాన్ని సినిమా పరిభాషలో ‘అన్ సీజన్’ అంటూ ఉంటారు. అయినా, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధైర్యంగా తన ‘అఖండ’ను విడుదల చేశారు. పైగా ఏపీలోని 13 జిల్లాల్లోనూ పరిమిత ఆటలు, హెచ్చించని టిక్కెట్ రేట్లతోనే ఈ సినిమా ప్రదర్శన సాగింది. ‘అఖండ’ విడుదలైన డిసెంబర్ 2న కొందరు ధైర్యం చేసి ఈ సినిమాను పరిమిత ప్రదర్శనలకు మించి ఓ ఆటను అదనంగా ప్రదర్శించారు. కొన్ని చోట్ల గతంలో లాగా టిక్కెట్ రేట్లను భారీగా పెంచి వసూలు చేశారు. అయితే, అక్కడి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు చేరగానే రెండవరోజు నుండి రోజు నాలుగు ఆటలు, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టిక్కెట్స్ అమ్మడం జరిగాయి. అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో తక్కువ రేట్ల మీదనే వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా ‘అఖండ’ చరిత్ర సృష్టించింది.
అటు…ఇటు…
‘అఖండ’తో బాలయ్య భలేగా సందడి చేయగా, నాగార్జున తాను నటించిన ‘వైల్డ్ డాగ్’తో లాక్ డౌన్ కు ముందే వచ్చారు. స్టార్ హీరోస్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ఎలిమెంట్స్ ఏమీ లేని ఈ సినిమా జనాన్ని ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే ఆయన ఈ యేడాది తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయడం విశేషం.
పైగా ఆ రెండు సినిమాలు రీమేక్స్ కావడం మరింత విశేషం. ‘నారప్ప’, ‘దృశ్యం-2’ చిత్రాలతో వెంకటేశ్ ఓటీటీలో సందడి చేశారు. ఈ రెండు సినిమాలు మంచి ఆదరణ పొందినట్టు వీక్షకుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. మోహన్ బాబు నటించిన ఏ సినిమా విడుదల కాకపోయినా, ఆయన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ ఆకట్టుకుంది. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ గా అలరించిన రాజశేఖర్ ఈ సారి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘దెయ్యం’లో కనిపించారు. ఆ సినిమా దారుణ పరాజయాన్ని చవిచూసింది.
పవన్ నాయక్!
నవతరం టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్, జూనియర్ యన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ సైతం ఏదో విధంగా సందడి చేశారనే చెప్పాలి. ఈ టాప్ హీరోలలో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘పింక్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో అజిత్ కుమార్ కోసం కొన్ని మార్పులూ చేర్పులూ చేసి అక్కడ ‘పింక్’ను రూపొందించారు. అదే సూత్రాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులతో తెలుగు ‘పింక్’గా వకీల్ సాబ్ జనం ముందు నిలచింది. అప్పటికి ఇంకా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల మీద, ఆటల మీద దృష్టి సారించక పోవడంతో ఎప్పటిలాగే బిగ్ హీరోస్ సత్తా చాటుతూ ‘వకీల్ సాబ్’ బాగానే పోగేసింది. ఆ తరువాత లాక్ డౌన్ సమయానికే ఈ సినిమా చేతనైనంత చేజిక్కించుకోగలిగింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన మరో రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో భలేగా హల్ చల్ చేసింది.
భలే భలేగా…
మహేశ్ బాబు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ఆయన పుట్టినరోజయిన ఆగస్టు 9న తాజా చిత్రం ‘సర్కార్ వారి పాట’ టీజర్ విడుదలయింది. అందులో మహేశ్ డైలాగ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా టీజర్ ను కూడా ఫ్యాన్స్ భలేగా లైక్స్ తో ముందుకు తీసుకు వెళ్ళారు. ప్రభాస్ గత సంవత్సరం ‘సాహో’తో అంతగా అలరించలేకపోయారు. దాంతో ఆయన తాజా చిత్రాలపైనే అభిమానులు గురి పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ “రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్” చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సలార్’లోని ఓ ఫైట్ సీన్ లీకయిందంటూ ఓ విజువల్ భలేగా సందడి చేసింది. ఇక ‘రాధేశ్యామ్’ ట్రైలర్ వచ్చీ రాగానే అనూహ్యంగా జనాన్ని కట్టిపడేసింది. జనవరిలో సంక్రాంతి కానుకగా రానున్న ‘రాధేశ్యామ్’పై ప్రభాస్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ఆ ఇద్దరు…
రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లో నటించడం మొదలెట్టిన దగ్గర నుంచీ జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ వేరే సినిమాలు అంగీకరించలేదు. దాంతో తొలి నుంచీ ‘ట్రిపుల్ ఆర్’పైనే జనం గురి పెట్టారు. ఆ సినిమా ప్రతీవార్త ఆసక్తిగా మారింది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న అతనికి సంబంధించిన టీజర్ విడుదలయింది. ఈ టీజర్ ‘భీమ్ ఫర్ రామరాజు’ టైటిల్ తో జనం ముందు నిలచింది. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ పై జూనియర్ యన్టీఆర్ వాయిస్ తో టీజర్ ఆకట్టుకొనేలా రూపొందింది. అభిమానుల హృదయాలను గెలిచింది. అదే తీరున జూనియర్ యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ‘రామరాజు ఫర్ భీమ్’ టైటిల్ తో మరో టీజర్ విడుదలయింది. ఇందులో జూనియర్ విజువల్స్ పై రామ్ చరణ్ వాయిస్ వినిపిస్తుంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ‘ట్రిపుల్ ఆర్’తోనే భలేగా సందడి చేశారని చెప్పాలి.
‘ట్రిపుల్ ఆర్’లోని నాలుగు పాటలు విడుదలైన ప్రతీసారి జూనియర్, రామ్ చరణ్ ముచ్చట్లే వినిపించాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిలో యన్టీఆర్ ను ముందు చూపించినందుకు కొందరు ఆనందించారు. రామ్ చరణ్ కు పలు షాట్స్ వేసి చూపించడంతో మరికొందరు సంతోషించారు. ఇందులో యన్టీఆర్ పాత్రకు క్రేజ్ కనిపిస్తున్నా, రామ్ చరణ్ రోల్ డామినేషన్ తో సాగినట్టు అనిపించింది. కానీ, నటన పరంగా జూనియర్ దే పైచేయిలా కనిపిస్తోంది. ఈ మధ్యే విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’లోని “కొమురం భీముడో…” సాంగ్ చూస్తే, నిజంగానే జూనియర్ తన నటనతో ఆకట్టుకోబోతున్నారని అనిపించక మానదు. జూనియర్ యన్టీఆర్ మరే చిత్రంలోనూ కనిపించలేదు. కానీ, ఈ టీజర్స్ తో, పాటలతో ఆకట్టుకున్నారు. అదే తీరున అలరించిన రామ్ చరణ్ మాత్రం అదనంగా తన తండ్రితో కలసి ‘ఆచార్య’లో నటించారు. అందులోని రామ్ చరణ్ విజువల్స్ సైతం అభిమానులను అలరించాయి.
అలా జరిగిందన్న మాట!
గత సంవత్సరం ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ కు ఆ సినిమా విజయం ఎంతో క్రేజ్ సంపాదించి పెట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప’ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ వరుసగా జనాన్ని ఆకట్టుకుంటూ సాగాయి. ఇక డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమాకు ఏపీలో పరిమిత ఆటలు, హెచ్చించ వీలుకానీ టికెట్ రేట్స్ ప్రతిబంధకంగా కనిపించాయి. దాంతో ‘పుష్ప’ నైజామ్ పంపిణీదారులు ఈ చిత్రానికి ప్రదర్శనల పెంపుకోసం, టిక్కెట్ రేట్ల హెచ్చింపు కోసం తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నారు. దాంతో ఏపీలో వాటిల్లిన నష్టాన్ని పూర్తిగా కాకపోయినా, అంతో ఇంతో భర్తీ చేయడానికి ఈ వెసులుబాటు పనిచేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదమై అలరించింది. అన్ని భాషల్లో కలిపి కోట్ల రూపాయల వసూళ్ళు వచ్చాయనే ప్రకటనలు కనిపించాయి. ఏది ఏమైనా ‘పుష్ప’గా అల్లు అర్జున్ అభినయం ఆకట్టుకుందనే చెప్పాలి.
రవితేజతోనే తొలి సక్సెస్!
సంక్రాంతి అచ్చివచ్చిన హీరోల్లో రవితేజ ఒకరని చెప్పవచ్చు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా రవితేజ నటించిన ‘క్రాక్’ విడుదలయింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ పొంగల్ బరిలో దూకిన ఇతర చిత్రాలకన్నా మిన్నగా విజయం సాధించింది. అలా 2021లో తొలి సక్సెస్ చూసిన హీరోగా రవితేజ నిలిచారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఏ ఒక్క సినిమా జనం ముందుకు రాకపోయినా, ఆయన నటించిన చారిత్రక నేపథ్యమున్న సినిమా ‘బింబిసారుడు’ ట్రైలర్ కొంతమందిని ఆకట్టుకోగలిగింది.
రామ్ పోతినేని ఒకే ఒక్క ‘రెడ్’తో జనాన్ని పలకరించగా, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. గత సంవత్సరం ‘భీష్మ’తో మంచి విజయం సాధించిన నితిన్ ఈ సారి ఏకంగా మూడు సినిమాలతో జనాన్ని పలకరించారు. వాటిలో “రంగ్ దే, చెక్” థియేటర్లలో సందడి చేసే ప్రయత్నం చేశాయి. ఫలితం అంతగా రుచించలేదు. ఇక నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో విడుదలయింది.
‘మూడే’…కానీ…
మరో యువకథానాయకుడు నాని గత యేడాది నటించిన ‘వి’ సినిమా అప్పట్లో ఓటీటీలో విడుదలయింది. ఇదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తూ నాని ఈ సారి చిత్ర ప్రయాణం మొదలెట్టారు. ఈ సినిమా థియేటర్లలోనూ పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇక నాని నటించిన ‘టక్ జగదీశ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలయింది. డిసెంబర్ 24న వచ్చిన నాని ‘శ్యామ్ సింగరాయ్’ జనాన్ని అలరిస్తోంది.
అన్నదమ్ముల కథ!
ఈ యేడాది అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ అచ్చి వచ్చిందనే చెప్పాలి. అన్న నాగచైతన్యకు దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’తో మంచి విజయాన్నే అందించారు. ఇందులో సాయిపల్లవి నాయికగా నటించడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇక అఖిల్ కెరీర్ లో తొలి హిట్ గా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ నిలచింది. ఈ సినిమాలో లక్కీ గాళ్ గా సాగుతున్న పూజా హెగ్డే హీరోయిన్ కావడం కారణంగా విజయం సాధించిందని టాక్!
చిరంజీవి మేనల్లుళ్ళు సాయిధరమ్ తేజ్, అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఈ సారి తమ సినిమాలతో సందడి చేశారు. సాయిధరమ్ నటించిన ‘రిపబ్లిక్’ థియేటర్లలో ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. అయితే ఓటీటీలో విడుదలై ఈ సినిమా భలేగా జనాన్ని మురిపించినట్టు వ్యూస్ ను బట్టి చెప్పారు. వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఉప్పెన’ చిత్రం మంచి విజయం సాధించింది. టైటిల్ కు తగ్గట్టుగానే ‘ఉప్పెన’ ఉవ్వెత్తున ఎగసిపడుతూ యువతను ఆకర్షించింది. అయితే ఈ యేడాది వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రంగా ‘కొండపొలం’ విడుదలయింది. ఈ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది, అలా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సంవత్సరమే ఓ హిట్, ఓ ఫట్ పట్టాడని చెప్పొచ్చు. మెగా కాంపౌండ్ కే చెందిన మరో హీరో వరుణ్ తేజ్ నటించిన ఏ సినిమా కూడా ఈ సారి జనం ముందుకు రాలేదు. కానీ, అతను హీరోగా నటించిన ‘ఘని’ ట్రైలర్ బాగానే అలరించింది.
మరికొందరు…
టాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా సాగుతున్న మరికొందరు హీరోలు కూడా పెద్దగా అలరించలేకపోయారనే చెప్పాలి. గోపీచంద్ నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో బి.గోపాల్ దర్శకత్వంలో నయనతారతో కలసి గోపీచంద్ నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఎప్పుడో విడుదల కావలసింది. కానీ, ఈ యేడాది వెలుగు చూసింది. ఫలితం మాత్రం చేదుగానే ఉంది. ఇక ‘సీటీమార్’తోనూ గోపీచంద్ జనాన్ని పలకరించారు.
కానీ, పులకరింప చేయలేకపోయారు. అల్లరి నరేశ్ ‘బంగారు బుల్లోడు’గా ఆకట్టుకోలేకపోయినా, ‘నాంది’లో వైవిధ్యమైన పాత్ర పోషించాడని పేరు సంపాదించారు. శర్వానంద్ “శ్రీకారం, మహాసముద్రం” చిత్రాలతో వచ్చినా, ఆకట్టుకోలేకపోయారు.
ఇక తెలంగాణ స్టార్ హీరో అనే ట్యాగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా జనం ముందుకు రాలేదు కానీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ టీజర్ తో సందడి చేశారు. నాగశౌర్య హీరోగా నటించిన “వరుడు కావలెను, లక్ష్య” చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. వాటిలో ‘లక్ష్య’ కోసం టెన్ ప్యాక్స్ సాధించి, జనాన్ని అలరించే ప్రయత్నం చేశారు నాగశౌర్య. అతని కష్టం ఫలించలేదు. కానీ, ‘వరుడు కావలెను’ మంచి ఊరటనిచ్చిందనే చెప్పాలి.
న్యూ స్టార్ హీరో!
శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా కాస్త గుర్తింపు సంపాదించిన వారు తరువాతి రోజుల్లో హీరోలుగా రాణించారు. అలాంటి వారిలో తానూ ఉన్నానని నవీన్ పోలిశెట్టి నిరూపించుకున్నారు. 2019లో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఆకట్టుకుంది. ఈ సంవత్సరం నవీన్ హీరోగా తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ భలేగా అలరించింది. పెట్టుబడికి తగ్గ రాబడి చూసిన చిత్రంగా నవీన్ నటించిన ‘జాతిరత్నాలు’ నిలిచిందనే చెప్పాలి. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి కూడా నవతరం తారగా ఎదిగారని చెప్పవచ్చు.
మరి అగ్రకథానాయకులు, నవతరం హీరోలు, కొత్తగా తారాపథం చూసిన నాయకులు రాబోయే 2022లో ఏ తీరున అలరిస్తారో చూడాలి.
