కరోనా వేవ్ తర్వాత షూటింగ్స్ పూర్తిచేసుకున్న సినిమాలు విడుదల చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన సినిమాలు పెద్ద పండగలను టార్గెట్ చేయడంతో సినీ ట్రాఫిక్ ఎక్కువే అవుతోంది. ఇక ఈ రిలీఫ్ టైమ్ లో మరికొన్ని చిత్రాలు ప్యాచ్ వర్క్ లతో తుదిమెరుగులు దిద్దుతుంటే.. మరికొన్ని చిత్రాలు రీషూట్ కు వెళ్తాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 కూడా రీషూట్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్ హీరో యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అత్యంత విజయాన్ని అందుకున్న భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
అయితే, ఈ సినిమా విడుదల కావడానికి కావాల్సినంత సమయం దొరకడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా కొన్ని సీన్స్ పై దృష్టిసారించారట.. షూటింగ్ సమయంలో ఉహించినంతగా కొన్ని షాట్స్ రాకపోవడంతో మరోసారి షూటింగ్ మొదలు పెట్టాడట. తాజాగా కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోందంటూ కన్నడలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రశాంత్ నీల్.. గ్యాప్ లో కేజీఎఫ్ 2 పై మరోసారి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడం.. పైగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో దర్శకుడు మరోసారి రీషూట్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.