Prabhas @ 20 Years: ‘బాహుబలి’గా భళారే అనిపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటునిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’ నవంబర్ 11తో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రం ప్రభాస్ ను అభిమానుల మదిలో ‘యంగ్ రెబల్ స్టార్’గా నిలిపింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ప్రభాస్‌ను ఫ్యాన్స్ అదే తీరున ఆదరిస్తున్నారు. ఆయన జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రభాస్ కు అభిమానులు జేజేలు కొడుతూనే ఉన్నారు. ఈ ఇరవై ఏళ్ళ కెరీర్ లో ప్రభాస్ 20 చిత్రాల్లో నటించాడు. ప్రభాస్ సక్సెస్ రేట్ తక్కువే అయినా, ‘బాహుబలి’తో ఒక్కసారిగా ఆయన ‘ఇంటర్నేషనల్ స్టార్’ అనిపించుకున్నాడు. తెలుగునాట ఆ స్థాయిలో పేరు సంపాదించిన హీరో మరొకరు కానరారు. అంతటి ఖ్యాతిని ఆర్జించిన ప్రభాస్ కెరీర్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎన్నెన్నో ఎత్తులూ పల్లాలు కనిపిస్తాయి.
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు మగసంతానం లేరు. దాంతో తమ్ముడు యు.వి.సూర్యనారాయణ రాజు చిన్న కొడుకైన ప్రభాస్‌నే తన వారసుడిగా ప్రకటించారు. కృష్ణంరాజు అభిమానులు సంతసించారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో నటనిర్మాత అశోక్ కుమార్ నిర్మించిన ‘ఈశ్వర్’తో హీరోగా ప్రేక్షకులను పలకరించాడు ప్రభాస్. ఈ సినిమా పరిచయ వేడుక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఆ వేడుకలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభాస్‌ను ఆశీర్వదించారు. ‘ఈశ్వర్’ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. తరువాత ప్రభాస్ రెండో చిత్రంగా ‘రాఘవేంద్ర’ తెరకెక్కింది. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో నటుడు హరనాథ్ తనయుడు బి.శ్రీనివాసరాజు నిర్మించిన ఈ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ మూడో చిత్రంగా ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘వర్షం’ చిత్రం 2004 జనవరి 14న విడుదలయింది. ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఎదురుగా అదే రోజున బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా ‘లక్ష్మీనరసింహా’ విడుదలై, ఆ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించినా, ‘వర్షం’ మాత్రం ప్రభాస్ కు తొలి ఘనవిజయాన్ని అందించింది. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ‘వర్షం’ ఆనందం పంచింది.
‘వర్షం’ తరువాత వచ్చిన ప్రభాస్ చిత్రాలు అడవిరాముడు, చక్రం ఏ మాత్రం మురిపించలేకపోయాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ అనూహ్య విజయం సాధించింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రంగా ‘ఛత్రపతి’ నిలిచింది. ఈ సినిమా తరువాత ‘వర్షం’ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘పౌర్ణమి’ జనం ముందు నిలచింది. మ్యూజికల్ హిట్ గా నిలచిన ‘పౌర్ణమి’ బాక్సాఫీస్ సక్సెస్ ను సాధించలేక పోయింది. ఆ పై ప్రభాస్ నటించిన చిత్రాలలో యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ అంతగా అలరించలేకపోయాయి. దాంతో రాజమౌళి సినిమాతో సక్సెస్ చూసిన హీరోకు తరువాత ఆ స్థాయి సక్సెస్ రావడం అంత ఈజీ కాదనే సెంటిమెంట్ ప్రభాస్ విషయంలోనూ నిజమైంది. తరువాత వచ్చిన ప్రభాస్ చిత్రాలు డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ బాగానే మురిపించాయి. కానీ, ‘ఛత్రపతి’ స్థాయి సక్సెస్‌ను చూడలేకపోయాయి. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ప్రభాస్ నటించిన తొలి చిత్రం ‘బిల్లా’ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. తరువాత కృష్ణంరాజు, ప్రభాస్ నటించిన లారెన్స్ రాఘవ చిత్రం ‘రెబల్’ కూడా అదే పంథాలో పయనించింది. కృష్ణంరాజు చివరి చిత్రంగా వచ్చిన ‘రాధే శ్యామ్’ సైతం ఆకట్టుకోలేదు.
కృష్ణంరాజు కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ఆయన సొంత చిత్రాలే ముందుంటాయి. సదరు చిత్రాలకు ఆయన తమ్ముడు సూర్యనారాయణ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అదే తీరున ప్రభాస్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో ఆయన అన్న ప్రమోద్, తన మిత్రుడు వి.వంశీకృష్ణారెడ్డితో కలసి యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘మిర్చి’ నిర్మించారు. ఈ సినిమాతో కొరటాల శివను దర్శకునిగా పరిచయం చేశారు. ‘మిర్చి’ అనూహ్య విజయం సాధించింది. ‘ఛత్రపతి’ తరువాత మళ్ళీ ప్రభాస్ కు ఆ స్థాయి సంతృప్తి కలిగించింది ‘మిర్చి’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా నటించిన అనుష్కతోనే ఆయన తరువాత వరుసగా ‘బాహుబలి’ సిరీస్ లో కనిపించారు. ఇక ‘బాహుబలి’ సిరీస్ ఏ స్థాయిలో అలరించాయో కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఇలా ఈ మధ్యకాలంలో వరుసగా ఒకే నాయికతో విజయాలు చూసిన హీరోగానూ ప్రభాస్ నిలిచారు.
‘బాహుబలి’ గ్రాండ్ సక్సెస్ ప్రభాస్ ను ఎక్కడికో తీసుకుపోయింది. దాంతో ఆయన సినిమాల మార్కెట్ పరిధి సైతం పెరిగింది. తరువాత వచ్చిన ‘సాహో’ చిత్రాన్ని ‘మిర్చి’ తీసిన నిర్మాతలే తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా ప్రభాస్ స్టార్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో అలరించలేకపోయింది. ‘బాహుబలి’ క్రేజ్ దృష్ట్యా ‘సాహో’ భారీ ఓపెనింగ్స్ చూసినప్పటికీ, అభిమానులు ఆశించిన విజయాన్ని మూటకట్టుకోలేక పోయింది. ఆ తరువాత కూడా ప్రభాస్ సొంత చిత్రం ‘రాధే శ్యామ్’లోనే నటించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే జనాన్ని పలకరించింది. ఫలితం మాత్రం నిరాశనే కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాబోయే చిత్రం ‘ఆదిపురుష్’పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మోషన్ క్యాప్చర్ తో తెరకెక్కిన ఈ పురాణగాథలో ప్రభాస్ మీసాల రాముడిగా కనిపించడాన్ని జనం తప్పు పట్టారు. ఈ సినిమాకు కొన్ని మార్పులు చేస్తూ, చిత్రాన్ని 2023 జూన్ 16న విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ ‘ఆదిపురుష్’ రూపొందుతోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ రాబోయే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ చిత్రాల తరువాత సి.అశ్వనీదత్, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్దేశకత్వంలో నిర్మించే ‘ప్రాజెక్ట్ కె’లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ గానే ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాలతో ప్రభాస్ ఏ స్థాయిలో జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.
(నవంబర్ 11న ప్రభాస్ కెరీర్ కు 20 ఏళ్ళు పూర్తి)