RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. RC16, ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనుందని తెలుస్తోంది. ఇందులో కూడా చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడట.
ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారట మేకర్స్. రంగస్థలం తరువాత అలాంటి గ్రామీణ నేపథ్యంలో చరణ్ నటిస్తున్నాడట. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని అర్ధం.. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని మా పెద్ది అని పిలుస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. కథ కూడా అలానే ఉండడంతో ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే చరణ్.. ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొనడం కూడా జరిగింది. ఆ క్యారెక్టర్స్ కూడా చరణ్ కు బాగా నచ్చాయని టాక్. ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్- బుచ్చిబాబు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.