ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా మూవీలే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక వాటిల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్- శంకర్. ఆర్ సి 15 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఆంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కు ఉన్న వివాదం కూడా భారీ బడ్జెట్ గురించే అన్న విషయం విదితమే.
భారతీయుడు 2 కోసం కోట్లలో బడ్జెట్ చేయించి, షూటింగ్ పూర్తికాకుండానే ఇంకొంత బడ్జెట్ కావాలని చెప్పడంతో వారిద్దరికీ పొసగలేదు. అది కాస్తా లీగల్ గా వెళ్లి శంకర్ చిక్కులో పడి బయటికి వచ్చాడు. ఆ అనుభవంతో శంకర్ .. రామ్ చరణ్ మూవీని అనుకున్న బడ్జెట్ ప్రకారం తీస్తాడేమో అని అందరు అనుకున్నారు. కానీ శంకర్ లో మాత్రం బడ్జెట్ విషయంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలోని ఒక పాట, ఫైట్ కోసం రూ. 20 కోట్లు ఖర్చుపెట్టాడట శంకర్.. ఒక్క ఫైట్ సీన్ కోసం శంకర్ రూ. 10 కోట్లు.. పాత కోసం దాదాపు రూ. 9 కోట్లు ఖర్చు అయ్యినట్లు సమాచారం. ఇక దీంతో ఒక పాట, ఫైట్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెడితే సినిమా పూర్తయ్యేసరికి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతాడో అని అభిమానులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే సినిమా కూడా అంతే భారీగా ఉందనున్నదని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
