Ravi Teja Warning Scene Leaked From Ramarao On Duty: విడుదలకి ముందే సినిమాల్లోని కీలక సన్నివేశాలు లీకవ్వడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. ప్రమోషన్స్ కోసం చిత్రబృందమే ఈ లీకేజ్‌లకి పాల్పడుతోందో లేక మరే ఇతర కారణమో తెలీదు పక్కాగా తెలీదు కానీ.. లీక్‌లు మాత్రం ఎక్కువైపోయాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి ఒక సీన్ లీకయ్యింది. ఇందులో రవితేజ పొలిటికల్ లీడర్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు.
‘‘రేయ్.. మీరెవరో, ఏ పార్టీయో నాకనవసరం. ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం, చెరువులు ఊడ్చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేస్తామని దౌర్జన్యం చేద్దామనుకుంటే..’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, ‘ఔట్ ఔట్’ అంటూ తన ఆఫీస్‌పై దాడి చేయడానికి వచ్చిన వారిని రవితేజ తరిమి కొడతాడు. ఇంటెన్సిటీతో రవితేజ చెప్పే ఈ డైలాగ్ చూస్తే.. కచ్ఛితంగా విజిల్ వేయకుండా ఉండలేరు. ఓ పిల్లాడు విజిల్ వేయడాన్ని క్లిప్ చివర్లో కూడా మనం చూడొచ్చు. చూస్తుంటే.. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులకు ఈ సినిమాతో రవితేజ గట్టిగానే క్లాస్ పీకబోతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశం ఎడిటింగ్ రూమ్ నుంచే లీకైందని స్పష్టంగా అర్థమవుతోంది.
కాగా.. శరత్ మండావా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రవితేజ కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇందులో దివ్యాంశా కౌశిక్, రజితా విజయన్ కథానాయికలుగా నటించగా.. చాలాకాలం తర్వాత వేణు తొట్టెంపూడి పోలీస్ పాత్రతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదే తన చివరి సినిమా అని కూడా ఆయన బాంబ్ పేల్చాడు. ఈ సినిమా రేపు (జులై 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘క్రాక్’ తర్వాత వరుస ఫ్లాపులు చవిచూసిన రవితేజ.. ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
