Ravi Teja Movie With Karthik Ghattamaneni Is Freemake Of John Wick: జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలకు సంతకం చేస్తున్నాడు. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో సినిమాకి పచ్చజెండా ఊపాడని సమాచారం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ యాక్షన్ త్రిల్లర్‌కు రవితేజ సంతకం చేశాడట. హాలీవుడ్‌లో మంచి విజయం నమోదు చేసిన జాన్ విక్ స్ఫూర్తితో ఈ యాక్షన్ త్రిల్లర్‌ని రూపొందించనున్నట్టు తెలిసింది. అంటే.. మక్కీకి మక్కీ కాపీ కొట్టకుండా, ఆ సినిమా తరహాలోనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాను తెరకెక్కించనున్నారు. సూటిగా, సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమాకి ఫ్రీమేక్ అన్నమాట!
‘జాన్ విక్’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. కేవలం తన కారుని కొట్టేయడంతో పాటు కుక్కను చంపేశారన్న కోపంతో.. విలన్లను చంపుకుంటూ పోతాడు. ఒక గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన పెద్ద సామ్రాజ్యాన్నే కూల్చేస్తాడు. తొలి భాగం కలెక్షన్ల వర్షం కురిపించడంతో, దానికి కొనసాగింపుగా మరో రెండు సీక్వెల్స్ వచ్చాయి. అవి కూడా హిట్ అవ్వడంతో.. ఇప్పుడు నాలుగో భాగం రాబోతోంది. దాన్నుంచి స్ఫూర్తి పొందే.. రవితేజతో ఓ భారీ యాక్షన్ సినిమాను కార్తిక్ ఘట్టమనేని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. జాన్ విక్‌తో కియాను రీవ్స్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో, ఇక్కడ రవితేజ కెరీర్ కూడా ఊపందుకోవడం ఖాయం.