టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఒక ఫోటోను షేర్ చేసి, తన అనుభూతిని చెప్పుకొచ్చింది. ” ఈరోజు నాకు బాగా దగ్గరైన నా స్నేహితురాలు రాగిని పెళ్లి. ఈరోజు దాటితే తర్వాత ఆమెతో ఫోటో కూడా దిగలేను. ప్రపంచం కోసం ఈరోజుని మిస్ చేసుకోవాలనుకోవడం లేదు. తెల్లవారుజామున 4 గంటలకు ప్లైట్ మిస్ అవ్వడం.. మరో ప్లైట్ కూడా నాలుగైదు సార్లు ఆలస్యం కావడం.
ఇలా వరుస ఇబ్బందులతో పెళ్లికి వెళ్లగలానా? లేదా? అని సందేహం వచ్చింది. కానీ దేవుడి దయల వల్ల ఎలాగో పెళ్లి సమయానికి హాజరయ్యాను. ఈ అమ్మాయిల మధ్యలోనే నేను పెరిగి పెద్దదాన్ని అయ్యాను. 17 ఏళ్ల వయసు నుంచి వీరు నాకు తెలుసు. ఇప్పటికి వీళ్లలో ఏ మార్పు రాలేదు. నన్ను ఎంతో సంతోషంగా చూసుకున్నారు. ఈరోజు వీళ్లందర్నీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. రష్మిక అనే యువతి మీకు, ప్రపంచానికి పరిచయం కాకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని” చెప్పుకొచ్చింది . అంతేకాకుండా తమ ఆచారానికి తగ్గట్టు చీరకట్టులో స్నేహితుల మధ్యలో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
