బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ పబ్లిక్ ఇష్యూస్ పై స్పందించటం మామూలే. అయితే, రెగ్యులర్ గా వారు ఏం మాట్లాడినా సంచలనమో, వివాదామో అవుతుంటుంది. అందుకే, కొంత మంది చాలా తక్కువగా సామాజిక అంశాలు స్పృశిస్తుంటారు. అలాంటి వారిలో రణవీర్ సింగ్ కూడా ఒకరు. ఆయన పెద్దగా సొషల్ ఇష్యూస్ పై స్పందించడు. అలాగే, వివాదాస్పద అంశాలు, పరిణామాలపై కూడా సైలెంట్ గానే ఉంటాడు. కానీ, తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని రణవీర్ స్వాగతించాడు. అలాగే, తన మనసులోని భావాల్ని విపులంగా పంచుకున్నాడు…
బధిరులు వాడే సంజ్ఞలతో కూడిన సైన్ లాంగ్వేజ్ ఇంత కాలం భాషగా హోదాను పొందలేదు. కానీ, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్ఎల్) ను అధికారికంగా గుర్తించింది. ఇక మీదట బధిరుల సంజ్ఞలు కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా చెలామణి అవుతాయి. అంతే కాదు, గవర్నమెంట్ ఐఎస్ఎల్ నేర్చుకోవాలనుకునే వారికి శిక్షణ కూడా ఇస్తుంది!
ఐఎస్ఎల్ ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించటం సంతోషంగా ఉందన్నాడు రణవీర్ సింగ్. ఆయన గతంలోనూ ఈ అంశంపై గళం విప్పాడు. ఒక పీటీషన్ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నప్పుడు తను సంతకం చేసి మద్దతు పలికాడు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ను అభినందిస్తూనే ఐఎస్ఎల్ భాషగా గుర్తింపు పొందిన సందర్భంగా పిటీషన్ మూవ్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల మున్ముందు చెవిటి వారికి ఎంతో మేలు కలుగుతుందని ‘బాజీరావ్ మస్తానీ’ స్టార్ అభిప్రాయపడ్డాడు…
