Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది. అంతేకాదు, అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా టైటిల్‌ను మార్చనున్నారనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చైనా మార్కెట్ సినీ పరిశ్రమకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఒక్క సినిమా విజయం సాధిస్తే వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాలు కూడా అప్పుడప్పుడు చైనా మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. అయితే ఈసారి ‘రామాయణం’ విషయంలో మేకర్స్ మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. చైనాలో ఈ సినిమాను ‘Ramayan: The Legend of Prince Charming’ అనే టైటిల్‌తో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఆఫీషియల్ అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ, విదేశీ మార్కెట్ లో ఇప్పటికే విడుదల చేసిన ఇంగ్లీష్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఎగిరే ఏనుగుల విజువల్స్, యశ్ రావణుడి లుక్ కి ఇంటర్నేషనల్ గా మంచి స్పందన వస్తోంది.
‘రామాయణం’ చైనా మార్కెట్‌లో విజయం సాధిస్తే మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అదే ‘దంగల్’ రికార్డు. దాదాపు పదేళ్ల క్రితం ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చైనాలో సంచలన విజయం సాధించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ సుమారు రూ.11 బిలియన్ వసూళ్లు సాధించి, భారతీయ సినిమాలకు కొత్త చరిత్ర రాసింది. కుస్తీ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు చైనా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రపంచ ప్రఖ్యాత ఇతిహాసమైన రామాయణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా చైనాలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది ప్రేక్షకుల్లో.
ఇక రామాయణం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6, 2026న విడుదల కానుండగా, భారతదేశంలో దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించింది. చైనాలో టైటిల్ మార్పు గురించి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్ రాకపోయినా, రామాయణం అక్కడ విడుదలైతే దంగల్ పదేళ్లుగా నిలిచిన చరిత్రను తిరగరాస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో మరింత పెరిగింది.

