Ramudu Kadu Krishnudu Completes 40 Years: తెలుగు చిత్రసీమలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు స్థానం ప్రత్యేకమైనది. తన అభిమాన నటుడు అగ్రపథాన నిలవాలని దాసరి పరితపించేవారు. అందుకు తగ్గట్టుగానే ఏయన్నార్ తో దాసరి చిత్రాలనూ రూపొందించారు. నటరత్న యన్.టి.రామారావు చిత్రసీమలో ఉన్నంత వరకూ ఆయనే నంబర్ వన్ గా సాగారు. ప్రముఖ సినిమా పత్రిక ‘జ్యోతిచిత్ర’ నిర్వహించిన ‘సూపర్ స్టార్’ బ్యాలెట్ లోనూ యన్టీఆర్ తరువాత ఏయన్నార్ నిలిచారు. అందువల్ల యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయగానే నంబర్ వన్ స్థానంలో అక్కినేనిని నిలపాలని దాసరి తపించారు. ఆ తపనలో రూపొందిన చిత్రం ‘రాముడు కాదు కృష్ణుడు’. 1983 మార్చి 25న విడుదలైన ‘రాముడు కాదు కృష్ణుడు’ వినోదం పంచుతూ విజయపథంలో పయనించింది. ఏయన్నార్ ను అమితంగా అభిమానించే యన్.ఆర్.అనురాధాదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అక్కినేని సరసన జయసుధ, రాధిక నాయికలుగా నటించారు.
ఇంతకూ కథ ఏమిటంటే- వంశప్రతిష్ఠకు ప్రాణమిచ్చే రావు బహదూర్ అప్పారావుకు రాము అనే అమాయకుడైన తనయుడు ఉంటాడు. అప్పారావు బంధువులు చుట్టూ చేరి ఆయన ఆస్తి కాజేయాలని ఆలోచిస్తూ ఉంటారు. రాముకు ఓ అన్నయ్య. అతను మరణిస్తాడు. అతని భార్య వరాలమ్మ, రామును కన్నకొడుకులా చూసుకుంటూ ఉంటుంది. శారద అనే పేద అమ్మాయిని రాము ప్రేమిస్తాడు. అది అతని తండ్రికి నచ్చదు. రామును గోపాలరావు కూతురు జయమ్మను పెళ్ళి చేసుకోమంటాడు తండ్రి. ఆ జయమ్మకు మరో బావ గిరితో సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని రాముకు వివరిస్తుంది వరాలమ్మ. దాంతో రాము ఆ పెళ్ళి వద్దంటాడు. రాముకు, వరాలమ్మకు అక్రమసంబంధం అంటగట్టి ఆమెను పిల్లలతో సహా ఇంటినుంచి గెంటేసేలా చేస్తారు గోపాలరావు అండ్ కో. రాము కూడా ఇంట్లోంచి వెళతాడు. దాంతో అప్పారావుకు పిచ్చిపట్టిందని బంధువులు ప్రచారం చేస్తారు.
పట్నంలో కృష్ణ ఎంతో తెలివైనవాడు. తన తల్లితో కలసి జీవిస్తూంటాడు. సత్య అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ సందర్భంలో రాము,కృష్ణ కలుసుకుంటారు. గతంలో గోపాలరావు కారణంగానే తన తండ్రి అప్పారావు గర్భవతి అయిన తన తల్లి లక్ష్మిని వదిలేశాడని తెలుస్తుంది. రాము స్థానంలో కృష్ణ ప్రవేశించి, గోపాలరావు అండ్ కో ఆటలు కట్టించి, అసలు విషయాలు బయటకు తీస్తాడు. అప్పారావుకు పిచ్చి పట్టిందని లోకాన్ని నమ్మించిన గోపాలరావుకు కూడా కృష్ణ పిచ్చిపట్టేలా చేస్తాడు. గోపాలరావు పిచ్చితో కొండపైనుంచి దూకి చస్తాడు. అందరూ మళ్ళీ కలుసుకొనేలా చేస్తాడు కృష్ణ. చివరకు రాము-శారద, కృష్ణ- సత్య ఆనందంగా ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
రావు గోపాలరావు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రాజసులోచన, జయంతి, సుకుమారి, జయమాలిని, మమత, అశోక్ కుమార్, జగ్గారావు, టెలిఫోన్ సత్యనారాయణ, సత్యేంద్రకుమార్, కొసరాజు రాఘవయ్య చౌదరి, మాస్టర్ మణికుమార్, మాస్టర్ శ్రీకాంత్ నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. ఇందులోని “ఒక లైలా కోసం…తిరిగాను దేశం…”, “అందమంత అరగదీసి…”, “చూశాక నిను చూశాక…మనసాపుకోలేక..”, “మంచు ముత్యానివో…హంపి రతనానివో…”,”అన్నం పెట్టమంది అమ్మ…”, “ఒక చేత తాళి…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రం మంచి ఆదరణ పొందింది. శతదినోత్సవం జరుపుకుంది.