మాస్ మహారాజ రవితేజ ఇటీవల్ ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మాస్ మాహారాజా ఖచ్చితంగా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమాలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వీ సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ కలెక్టర్ రామారావు గా కనిపించాడు.
నీతికి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న కలెక్టర్ ని కొంతమంది అడ్డుకోవాలని చూడడం, వారి తాట తీసి హీరో దారిలో పెట్టడం చూపించారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో మొదలైన టీజర్లో అన్ని ఎమోషన్స్ ని చూపించారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ నటిస్తున్నారు. ‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో వుంటుంది… ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా వుంటుంది’ డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. చివర్లో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కనిపించి మెప్పించాడు. ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తునట్లు కనిపిస్తోంది. ఇక సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ శ్యామ్ సిఎస్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో రవితేజ హిట్ ని అందుకుంటాడా ..? లేదా అని చూడాలి.
