పాటతో ప్రయాణం చేయాలనే తొలి నుంచీ ఆశించారు రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన అభిలాష పాటలు పాడాలన్నది. కానీ, పాటలు రాసే పనిలో విజేతగా నిలిచారు. అదే చిత్రం! చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలకు కొదవే లేదు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాట లేకుండా పలకరించే చిత్రాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నేటి సినిమా రంగంలో బిజీగా సాగుతున్న గీత రచయితల్లో ముందువరుసలో ఉన్నారు రామజోగయ్య శాస్త్రి. కొందరు ఆయన పాటలు విని, అచ్చు సీతారామశాస్త్రి లాగే పాటలు రాస్తారని అన్నారు. మరి కొందరు ‘చిన్న శాస్త్రి’ అంటూ అభిమానంగా పిలిచారు. ఇంకొందరు మరో వేటూరి ఆయనలో ఉన్నాడనీ వ్యాఖ్యానించారు. ఎవరు ఎలా పిలిచినా, పలుకుతూ పాటలు పలికిస్తూ, అవకాశం దొరికిన చోట పాటగాడిగా మారుతూ, అడపాదడపా తెరపై కనిపిస్తూ సాగుతున్నారు రామజోగయ్య శాస్త్రి.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ళలో 1970 ఆగస్టు 24న రామజోగయ్య శాస్త్రి జన్మించారు. తండ్రి పూజారి, వ్యవసాయం కూడా చేసేవారు. బాల్యం నుంచీ రామజోగయ్య చదువుల్లో దిట్ట అనిపించుకున్నారు. ఐదో క్లాస్ చదువుతున్న సమయం నుంచీ సినిమాలపై మోజు పెరిగింది. తాను చూసిన చిత్రాల్లోని పాటలను పాడుతూ, తానూ ఏ రోజునైనా సినిమాల్లో పాటలు పాడాలని కలలు కనేవారు రామజోగయ్య. వరంగల్ ఆర్.ఈ.సి.లో బి.టెక్, చేసిన రామజోగయ్య ఖరగ్ పూర్ ఐఐటీలో ఎమ్.టెక్, పూర్తి చేశారు. బెంగళూరులో మంచి ఉద్యోగం, వేరే దారి లేక అటువైపే వెళ్ళారు. అక్కడ కొందరు గీత రచయితలు, గాయకులను పరిచయం చేసుకున్నారు. తానూ పాడాలని ప్రయత్నించారు. అయితే వారు “నీలో మంచి సాహిత్యకారుడు ఉన్నాడు. ముందు గీతరచనలో పట్టు సాధించు” అని సూచించారు. అదే తీరున కన్నడలో పాటలు రాయడం ఇట్టే నేర్చారు. కొన్ని భక్తి గీతాలు, మరికొన్ని కన్నడ సినిమాలకు పాటలు రాశారు. జోగయ్య పనిచేసే సంస్థ ఇబ్బందులకు గురయింది. దాంతో హైదరాబాద్ చేరారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూనే దర్శకుడు కృష్ణవంశీని కలిశారు. ఆయన ద్వారా సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. ఓ వైపు పనిచేస్తూనే, మరోవైపు సీతారామశాస్త్రి వద్ద పాటల రచనలో మెలకువలు పట్టేశారు. సిరివెన్నెల ప్రోత్సాహంతోనే స్రవంతి రవికిశోర్ నిర్మించిన ‘యువసేన’ చిత్రంలో తొలిసారి గీత రచన చేశారు. అప్పటి నుంచీ సీతారామశాస్త్రి పాటలు రాసే చిత్రాలలో రామజోగయ్య సైతం కలం కలిపేవారు. అలా ఒక్కోమెట్టూ ఎక్కుతూ సాగారు. మెల్లగా సింగిల్ కార్డ్ వేయించుకొనే స్థాయికి చేరుకున్నారు. ట్యూన్ ఇచ్చినా, లేకున్నా ఇట్టే పాటలు రాసేయడం మొదలెట్టారు. దాంతో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు రామజోగయ్య శాస్త్రిని ప్రోత్సహిస్తూ సాగారు. తన అణకువతోనే రామజోగయ్య చిత్రప్రయాణం సాగిస్తున్నారు.
ఇప్పటికే వందలాది పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రికి రెండు నంది అవార్డులు ప్రకటించారు. ‘శ్రీమంతుడు’లో ఆయన రాసిన “పోరా…శ్రీమంతుడా…” పాటతో 2015లోనూ, ‘జనతా గ్యారేజ్’లోని “ప్రణామం…ప్రణామం…” పాటతో 2016లోనూ ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుకు ఎంపికయ్యారు రామజోగయ్య. “కింగ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను” వంటి చిత్రాలలో తెరపై కాసేపు కనిపించి అలరించారాయన. ఇక పాటలు పాడాలి అన్న తన చిన్ననాటి కలను కూడా కొన్ని చిత్రాల ద్వారా నెరవేర్చుకున్నారు శాస్త్రి. తెలుగు జనం రామజోగయ్య శాస్త్రి పాటలకు పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఆయన మరిన్ని మధురగీతాలతో జనాన్ని అలరిస్తూ సాగాలని ఆశిద్దాం.