Ramajogaiah Sastry: సంక్రాంతికి రాబోతున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ లోనూ తన కలం బలం చూపించారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. నందమూరి నటసింహం బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ‘వీరసింహారెడ్డి’లో పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి రాయడం విశేషం. అలానే మెగాస్టార్ చిరంజీవి – రవితేజ మూవీ ‘వాల్తేరు వీరయ్య’లో ‘నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ’ పాటను ఆయనే రాశారు. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ, ”’నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ అనే దానిలో సౌండింగ్ సరదాగా అనిపించింది. అదే దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది” అని అన్నారు. విశేషం ఏమంటే… తన సినిమాల్లో అప్పుడప్పుడూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చే రామజోగయ్య శాస్త్రి, ‘వీరసింహారెడ్డి’ మూవీలోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో మెరుపులా మెరిశానని అన్నారు. కొన్నేళ్ళుగా ఈ రంగంలో ఉండటం వల్ల ఆ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుందని, అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుందని చెప్పారు.
సంక్రాంతికి వస్తున్న రెండు సినిమాల గురించి మాట్లాడుతూ, ”’వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన నంత సమయం ఇస్తారు. పైగా ‘అఖండ’ సినిమాకి నేను రాయలేదు. ఆ పట్టుదల వుంది. ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. ‘వీరసింహారెడ్డి’కి సింగిల్ కార్డ్ రాశాను. కథ మొత్తం చెప్పారు. దాన్ని విన్నతర్వాత మరింత బలంగా రాసే అవకాశం కలిగింది. తమన్ తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి వుంటుంది” అని అన్నారు. ‘వీర సింహారెడ్డి”కి సింగిల్ కార్డ్ వల్ల ఎలాంటి టెన్షన్ తాను పడలేదని చెబుతూ, ”సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం వుంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం వుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం, ఫ్లో సరిగ్గా వుందో లేదో చెక్ చేసుకునే అవకాశం వుంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కో-ఆర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సి వస్తుంది” అని చెప్పారు.
పెద్ద హీరోలకు రాసేప్పుడు అభిమానుల నుండి ఎదురయ్యే సవాళ్ళ గురించి చెబుతూ, ”నిజం చెప్పాలంటే… ప్రతి పాటకు సవాల్ ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికి బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో కొత్తగా ఏం చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాను. సో… ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ సహజంగా వుంటుంది” అని అన్నారు. బాలయ్య సినిమాలోని ‘మా బావ మనోభావాలు’ ఐడియా తనదేనని, ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడని, తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగిందని, మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పాటతో కనెక్ట్ అవుతున్నారని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి గారికి పాటలు రాస్తున్నపుడు వాళ్ళకున్న ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుందని, కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలమని, చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారని, అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళితే, బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారని రామజోగయ్య శాస్త్రి చెప్పారు.
