సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్’. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె. శుక్రన్ దర్శకత్వంలో డాక్టర్ ఎ.ఎస్. జడ్సన్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు కె . శుక్రన్ మాట్లాడుతూ, ”నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర ‘బాహుబలి’ సినిమాకు పనిచేశాను. అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్. శంకర్ గారి దగ్గర వర్క్ చేశాను. నాకు మొదట ‘ఏంజెల్’ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చింది ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి గారు. ఇక ఈచిత్ర కథ విషయానికి వస్తే, ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది” అని అన్నారు.
హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ, ”ఈ చిత్రంలో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను. పల్లెటూరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ? వాటిని పరిష్కరించేందుకు రామ్, రావణ్ అనే యువకులు ఏం చేశారు? ఎలా పోరాడారు? అనేది కథ. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు. ఈ చిత్రంలో తాను రావణ్ పాత్ర చేస్తున్నట్టు రాజ్ బాలా చెప్పారు.