Site icon NTV Telugu

Ram : భారీ రెమ్యూనరేషన్ కు డిమాండ్… రిస్క్ తప్పదా?

Ram

Ram

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ అప్పుడే సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం రామ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.

Read Also : RadheShyam: వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ తో సిద్దమైన ప్రేమ జంట

“అఖండ”తో భారీ హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్ పెరిగినట్టు తెలుస్తోంది. ఆ సినిమా విజయంతో బోయపాటికి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు. ఇక బోయపాటి నెక్స్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో చేయాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం గీతా ఆర్ట్స్ కోసం అల్లు అర్జున్ సినిమాను ప్రారంభించాలనుకున్నాడు. అయితే అల్లు అర్జున్ మరో ఎనిమిది, పది నెలల పాటు “పుష్ప 2” షూటింగ్‌లో బిజీగా ఉండనున్నాడు. కాబట్టి బోయపాటి శ్రీను వేరే స్టార్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రామ్ పోతినేనితో సినిమా ప్రారంభించడానికి చర్చలు జరిగాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ తెరపైకి రావాలంటే బడ్జెట్‌ భారీగానే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ పోతినేని 15 కోట్లు డిమాండ్ చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు రామ్‌కి ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి అంగీకరిస్తే, హీరో దర్శకుడు ఇద్దరికీ కలిపి ఏకంగా రూ.30 కోట్లు అవుతుంది. ప్రొడక్షన్, ఇతర రెమ్యూనరేషన్ల కోసం నిర్మాత మరో 40 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ దాదాపు 100 కోట్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు రామ్ సినిమాలు 40 నుంచి 50 కోట్లలోపే రాబడుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ రావాలంటే నిర్మాతలు రిస్క్ తీసుకోవాల్సిందే.

Exit mobile version