Site icon NTV Telugu

Ram Gopal Varma: ‘సిగ్గు సిగ్గు’ అంటూ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు

Rgv On Krishnamraju Death

Rgv On Krishnamraju Death

Ram Gopal Varma Sensational Comments On Tolywood: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపకపోవడం నిజంగా సిగ్గు చేటు అంటూ మండిపడ్డాడు. ఒక మహోన్నత కళాకారుడికి మహోన్నత వీడ్కోలు ఇవ్వకపోవడం.. మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని అన్నాడు. రేపు ఇతర స్టార్ హీరోలకి ఇదే దుస్థితి వస్తుందని, కాబట్టి కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషికి రెండు రోజులపాటు షూటింగ్ ఆపేద్దామని వర్మ వరుస ట్వీట్లు చేశాడు.

‘‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప సినిమాలను అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత అయిన కృష్ణంరాజు కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరితమైన తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’’ అంటూ బాంబ్ పేల్చాడు. ఆ తర్వాత ట్వీట్‌లో.. ‘‘కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, మోహన్‌బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్‌ లాంటి స్టార్లకు కూడా రేపు ఇదే దుస్థితి రాక తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం వంటిది. మనసు లేకపోయినా సరే.. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే, పోయిన కృష్ణంరాజు లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. రెండు రోజులు షూటింగ్ ఆపుదాం’’ అని వర్మ కోరాడు. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతోందని నెల రోజులపాటు షూటింగ్ ఆపినప్పుడు.. కృష్ణంరాజు కోసం రెండ్రోజులపాటు షూటింగ్ ఆపలేరా? అంటూ వర్మ నిలదీశాడు.

లాజికల్‌గా ఆలోచిస్తే.. వర్మ చెప్పింది ముమ్మాటికీ నిజం. ఎన్నో గొప్ప సినిమాలు చేసి, ఎన్నో సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి కాలం చెల్లినప్పుడు.. ఆయన గౌరవార్థం కనీసం రెండు రోజుల పాటు షూటింగ్ ఆపడంలో తప్పు లేదు. ఇటీవల పరిశ్రమలో కొన్ని సమస్యలు ఉందని, వాటి పరిష్కారం కోసం కొన్ని రోజులు షూటింగ్ ఆపేస్తున్నామని పరిశ్రమ పెద్దలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు, ఇండస్ట్రీకి చాలా సంవత్సరాలు సేవలందించిన ఒక గొప్ప వ్యక్తి కోసం షూటింగ్ ఆపడంలో తప్పేంటి?

Exit mobile version