డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్‌కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు వర్మ తెలిపారు. ఈ మేరకు కొండా సినిమాకి సంబంధించి వర్మ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ తన వాయిస్ ఓవర్ తో ఏం మాట్లాడారంటే.. ‘తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నమొన్నటివరకు కూడా ఏమీ తెలియదు. ఈ మధ్య కో ఇన్సిడెంటల్ గా నేను కలిసిన కొంతమంది మాజీ నక్సలైట్లు, ఇంకొంతమంది అప్పటి పోలీస్ ఆఫీసర్ల నుంచి నాకు ఫస్ట్ టైమ్ ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో నన్ను ముఖ్యంగా విపరీతంగా ఆకర్షించింది ఎన్ కౌంటర్ లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ఇంకా కొండా మురళికి ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం. ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్ గ్రౌండ్, అప్పటి పరిస్థితులను సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయడం వెనుకున్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు’. అని వర్మ తెలిపారు.
‘విప్లవం అనేది ఎప్పటికీ ఆగడు. దాని రూపు మార్చుకుంటుంది అంతే. ‘కొండా’ సినిమా చిత్రీకరణ వరంగల్, పరిసర ప్రాంతాల అడవుల్లో జరగనుంది. మా చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతుంది’అంటూ వర్మ చెప్పుకొచ్చారు.
