Sukumar Planning Ram Charan’s RC17 Two-Part Film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ‘పెద్ది’ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు సుకుమార్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందించిన ఈ సూపర్ హిట్ కాంబినేషన్.. మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘RC17’ ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై పాన్ ఇండియా స్థాయిలో హైప్ ఏర్పడింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కథ పరిమాణం, దాని విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథను పూర్తి స్థాయిలో చెప్పాలంటే.. రెండు భాగాలుగా రూపొందించడమే సరైన నిర్ణయమని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. రామ్ చరణ్ కెరీర్‌లో తొలిసారిగా రెండు భాగాలుగా విడుదలయ్యే చిత్రం ఇదే కానుంది.
‘పుష్ప’ ఫ్రాంచైజీతో రెండు భాగాల ఫార్మాట్‌లో భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్.. అదే వ్యూహాన్ని RC17 విషయంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించే అవకాశముందని సమాచారం. భారీ స్టార్ కాస్ట్‌తో పాటు, ఇప్పటివరకు చూడని స్థాయిలో పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల ‘పెద్ది’ సక్సెస్ మీట్‌లో కూడా RC17 గురించి ప్రస్తావించిన సుకుమార్.. ‘ఈ సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి’ అంటూ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాడు.
అయితే RC17 రెండు భాగాల వార్తపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ‘పుష్ప 2’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం మరో భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథ, మేకింగ్, విజువల్ గ్రాండియర్ పరంగా ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.

