Site icon NTV Telugu

Rakhi Sawant: నా మాజీ భర్త నిలువునా దోచేసుకున్నాడు

Rakhi Sawant Ex Husband Ritiesh

Rakhi Sawant Ex Husband Ritiesh

ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా విచిత్రమైన పనితో వార్తల్లోకెక్కే బాలీవుడ్ భామ రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌తో కలిసి.. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీస్ స్టేషన్‌లో మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన షోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ చెల్లింపుల విధానాల్ని మాజీ భర్త రితేష్ హ్యాక్ చేశాడని.. తన జీవితాన్ని నాశనం చేస్తానని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఆదిల్‌ను చూసి రితేష్ అసూయ చెందుతున్నాడని, అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేస్తున్నాడంటూ రాఖీ సావంత్ ఆరోపణలు చేసింది.

‘‘నా మాజీ భర్త రితేష్ నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, జీ-మెయిల్ ఖాతాల్ని హ్యాక్ చేశాడు. నా ఖాతాలన్నింటిలోనూ అతని పేరు, నంబర్ ఉన్నాయి. మేమిద్దరం కలిసున్నప్పుడు నా ఖాతాల వివరాల్ని అతడికిచ్చాను. అప్పట్నుంచి పాస్‌వర్డ్‌లు మార్చలేదు. మేమిద్దరం స్నేహపూర్వకంగా విడిపోయినప్పటికీ.. అతడు ప్రతీకార ధోరణితోనే వ్యవహరిస్తున్నాడు. నన్ను నాశనం చేస్తానని బెదిరించాడు కూడా! ఈమధ్య మనం ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి డబ్బులు ఆర్జిస్తున్నామన్న విషయం అందరికీ తెలుసు. అతడు దాన్ని కూడా హ్యాక్ చేశాడు. అందుకనే అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వచ్చాను’’ అని రాఖీ సావంత్ మీడియాతో చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో కలర్స్ టీవీకి వ్యతిరేకంగా రితేష్ విషయాలు పోస్ట్ చేస్తున్నాడని రాఖీ తెలిపింది. వాటిని చూసి, తానే రాస్తున్నానేమోనని టెలివిజన్ వాళ్ళు భావిస్తున్నారని.. తనని వాళ్లు బ్యాన్ చేయాలని రితేష్ గట్టిగా కోరుకుంటున్నాడని రాఖీ సావంత్ పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version