ఈరోజు అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు రజినీకాంత్. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రజనీకాంత్‌కి అవార్డును అందజేసి అభినందించారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించిన రజనీకాంత్ చిరునవ్వుతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. తాను అందుకున్న ఈ అవార్డును తన గురువు కె బాలచందర్ కు, రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ గైక్వాడ్, బెస్ట్ ఫ్రెండ్ రాజ్ బహదూర్‌లకు అంకితం చేశారు.
Read Also : “ఆర్ఆర్ఆర్” రన్ టైమ్ ఎంతంటే ?
అనంతరం రజినీకాంత్ మాట్లాడుతూ “ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నన్ను సత్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా గురువు కె. బాలచందర్ సర్‌కు అంకితం చేస్తున్నాను. నా తండ్రి లాంటి సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ నాకు గొప్ప విలువలు నేర్పించినందుకు, నాలో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా స్నేహితుడు, తన స్నేహితుడు, బస్ కండక్టర్ అయిన రాజ్ బహదూర్ నాలోని నటుడిని గుర్తించి నన్ను సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించిన వ్యక్తి.. నన్ను నమ్మి నాతో సినిమాలు చేసిన గౌరవనీయులైన దర్శకులు, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సాంకేతిక నిపుణులకు, పంపిణీదారులకు ధన్యవాదాలు. ప్రదర్శకులు, మీడియా, నా అభిమానులందరికీ, తమిళ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేకుండా నేను లేను” అంటూ చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ 1975లో దివంగత దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో అరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌తో 160కి పైగా చిత్రాలలో నటించారు. ఇండియాలోని ఉత్తమ నటులలో ఒకరిగా కీర్తిని గడించారు. తన నటనతో, స్టైల్ తో సౌత్ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే” విడుదలకు సిద్ధంగా ఉంది. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
