డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు మాత్రమే ‘పద్మ’ పురస్కారం లభించడం ఇత్యాది అంశాలు సైతం రాజమౌళి అనగానే నేషనల్ లెవెల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ టిక్కెట్ రేట్ల పెంపుతో ఈ యేడాది టాప్ ట్రాసర్ గా నిలిచింది. దీంతో రాజమౌళి తరువాతి చిత్రం ఎలా ఉంటుందన్న చర్చ అప్పుడే మొదలయింది. రాజమౌళి ఈ సారి మహేశ్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ విషయం చాలా రోజుల క్రితమే ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనీ రాజమౌళియే చెప్పారు. రాబోయే మహేశ్ సినిమా మళ్ళీ రాజమౌళి ‘బాహుబలి’ రికార్డులు బద్దలు చేస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ ముచ్చట ఇలా సాగుతోంటే, రాజమౌళి తరువాత తీయబోయే కథ ఇలా ఉంటుందంటూ ఓ ముచ్చట వినిపిస్తోంది. రాజమౌళి గురువు కె.రాఘవేంద్రరావు పేరు వినగానే ఆయన తెరకెక్కించిన అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. వాటిలో అన్నిటికన్నా ముందుగా ఆబాలగోపాలానికి గుర్తుకు వచ్చే సినిమా యన్టీఆర్ ‘అడవిరాముడు’. స్టూడియోతో పనిలేకుండా 45 ఏళ్ళ క్రితమే రాఘవేంద్రరావు ‘అడవిరాముడు’ను తెరకెక్కించారు. ఈ విషయాన్ని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. జంగిల్ మూవీస్ లో ‘అడవిరాముడు’ నేటికీ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. రాజమౌళి మహేశ్ తో తీయబోయే చిత్రం జంగిల్ మూవీ అని వినిపిస్తోంది. అంతేకాదు, జంగిల్ మూవీ అంటే కేవలం అడవిలో తీయడం కాకుండా, పలు జంతువులను షూటింగ్ లో ఉపయోగించాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తమై జంతువులను ఉపయోగించడం మన దేశంలో నిషేధం. అందువల్ల మహేశ్ తో రాజమౌళి తీయబోయే జంగిల్ మూవీని ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రధాన భాగమంతా అక్కడ షూట్ చేసి, తరువాత తెలుగునేలపై కొన్ని కీలక సన్నివేశాలను, కొన్ని పాటలను తెరకెక్కిస్తారని వినిపిస్తోంది. మరి ఇదే నిజమయితే, రాజమౌళి తన గురువు రాఘవేంద్రరావు బాటలోనే పయనిస్తూ ‘స్టూడియో అవసరం లేకుండా’ ఈ జంగిల్ మూవీని తెరకెక్కిస్తారేమో చూడాలి.
