Rajamouli Is Main Villain For Tollywood Says Ram Gopal Varma: గతేడాదిలో థియేటర్లు తెరుచుకున్నప్పటి నుంచి సర్కారు వారి పాట సినిమా వరకూ.. టాలీవుడ్ ఓ కుదుపు కుదిపేసింది. మిగతా ఇండస్ట్రీలన్నీ చతికిలపడిపోతే.. మన తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం కలెక్షన్ల వరద పారించింది. కానీ.. ఆ తర్వాతి నుంచే ఇండస్ట్రీ పరిస్థితి దయనీయంగా మారింది. వస్తోన్న ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. హిట్ టాక్ సంపాదించిన చిత్రాలు సైతం, కలెక్షన్లు రాబట్టలేక నానా తంటాలు పడుతున్నాయి. దీంతో థియేటర్లకు జనాలు రావడం లేదన్న టాక్ ఊపందుకుంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు ఓటీటీలే ఇందుకు కారణమని నిర్మాతలు చెప్తున్నారు. కారణాలేమైనా.. ఇండస్ట్రీలో సంక్షోభం నెలకొంది. దీన్ని అధిగమించేందుకే షూటింగ్స్‌ని నిలిపివేశారు. దీనిపై ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళినే అంటూ బాంబ్ పేల్చాడు. ఓటీటీ వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనల్లో వాస్తవం లేదని, టాలీవుడ్‌కి అసలు శత్రువు రాజమౌళి అని కుండబద్దలు కొట్టాడు. ఓటీటీ వల్ల ఈ పరిస్థితి రాలేదన్నాడు. జక్కన్నతో పాటు యూట్యూట్ కూడా టాలీవుడ్‌కి శత్రువేనన్నాడు. ‘‘ఇప్పుడు జనాలందరూ షార్ట్ వీడియోలకు అలవాటు పడ్డారు. ఎక్కువగా యూట్యూబ్‌ని అనుసరిస్తున్నారు. వాటికి అలవాటు పడటం వల్లే థియేటర్లకు రాలేకపోతున్నారు. థియేటర్లలో రెండు గంటలపాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే.. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లేదా కేజీఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే తీయాలి’’ అని వర్మ ఓ తెలుగు ఛానెల్‌తో ముచ్చటించిన సందర్భంగా చెప్పుకొచ్చాడు.