కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శివ శంకర్ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఆయన లేరన్న వార్త తెలిసిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : శివశంకర్ మాస్టర్ మృతిపై పవన్, బాలయ్య ఏమన్నారంటే..?
తాజాగా దర్శకుడు రాజమౌళి ‘ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. మగధీర కోసం ఆయనతో కలిసి పనిచేయడం మరపురాని అనుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ సంతాపం తెలియజేశారు. ఇక ఆయనతో పాటు పలువురు సెలెబ్రిటీలు మాస్టర్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
