NTV Telugu Site icon

iBOMMA : ఐబొమ్మకు డైరెక్టర్ వార్నింగ్.. దమ్ముంటే ఆ పని చేసి చూపించండి

Raj

Raj

iBOMMA: సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రంలో మొదటిది ఫైరసీ. దీనివలన ఎంతమంది నిర్మాతలు నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సినిమాలు థియేటర్ లో సినిమా పడిన నెక్స్ట్ మినిట్.. ఫైరసీ సైట్స్ లో దర్శనమిస్తుంది. దీనివలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎన్నో కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఫైరసీని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతుంది. ఇక అప్పుడంటే తమిళ్ రాకర్స్ అని ఉండేది.. ఇక ఇప్పుడు ఆ ఐబొమ్మ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఓటిటీ, థియేటర్ లో వచ్చే HD ప్రింట్స్ ను ఎలాంటి డబ్బులు కట్టించుకోకుండా ఐబొమ్మ ఫ్రీగా చూపిస్తోంది. దీంతో ఈ సిట్ కు ఫ్యాన్స్ చాలా ఎక్కువమందే ఉన్నారు. దీని ఆపడానికి చాలామంది చాలాసార్లు ట్రై చేశారు.. కానీ కాలేదు. ఆ తరువాత ఐబొమ్మ మేకర్స్ సైతం సైట్ ను ఆపేస్తామని చెప్పారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ స్టార్ట్ చేశారు. ఇక కొన్నాళ్ళక్రితం ఈ ఐబొమ్మ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చాడు.. “మీరు హీరోలకు అంతంత రెమ్యునరేషన్స్ ఇస్తారు.. ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరిస్తారు.. టికెట్ రేట్లు పెంచి మా మధ్యతరగతివాడి నెత్తిన మోపుతారు.. అందుకే, మీకు బుద్ధి రావాలనే మేము మీ సినిమాలను అక్రమంగా మా సైట్లలో పెడతాము.. మేము చేసేది పైరసీ కాదు, న్యాయం” అని చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ వ్యాఖ్యలను నటుడు, డైరెక్టర్ అయిన రాజ్ మదిరాజు ఖండించాడు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి జంటగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ ఒరిజినల్ సిరీస్ .. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని కూడా ఐబొమ్మ తమ సైట్ లో పెట్టింది. దీంతో ఫైర్ అయిన డైరెక్టర్ ఐబొమ్మకు స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. “అయ్యా ఐబొమ్మా..
#కృష్ణారామా సినిమాలో పెద్ద హీరోలు లేరు.. రెమ్యునరేషన్స్ తీసుకున్న ఇద్దరు పెద్ద తారలూ మధ్యతరగతివాళ్ళే.. రోజుకూలీకి పనిచేసేవాళ్ళే.. చాలా ఎమ్మెన్సీలో ఎగ్జిక్యూటివ్స్ కన్నా వీళ్ళ సంపాదన తక్కువే.. వాళ్ళ సంపాదనకు సరిపోను టాక్సులు కట్టేవాళ్ళే.. మాది ఒరిజినల్ కథ.. ఎక్కణ్ణుంచీ కాపీ కొట్టింది కాదు.. ఇక సినిమా షూటింగు మొత్తం హైదరాబాదులోనే తీశాము.. సినిమాను థియేటర్లలో రిలీజు చేయలేదు.. డైరెక్ట్ ఓటీటీ రిలీజు.. మధ్యతరగతివాడికోసం వందరూపాయలు కడితే ఫ్యామిలీ అందరూ కూర్చుని నెలంతా సినిమాలు చూసుకునే ఫెసిలిటీ ఇచ్చారు..
ఇంట్లో పకోడీలు చేసుకుని సినిమా చూడ్డానికి కూర్చుంటే పాప్‌కార్న్ ఖర్చు కూడా ఉండదు.

సో, ఇప్పుడు చెప్పండి.. మీ సైట్లో మా సినిమా ఎందుకు పెట్టారు.. మా నిర్మాతలు అడగడంలేదీ మాట.. వాళ్ళు కొత్తగా లాంచి చేసిన వాళ్ళ ప్లాట్‌ఫారంని యూజర్‌ఫ్రెండ్లీగా మార్చడంలో తలమునకలై ఉన్నారు.. వాళ్ల తరపున నేనడుగుతున్నానీమాట..నిజానికి సినిమా దర్శకుడిగా నా సినిమా ఎన్ని ఎక్కువ సైట్లలో కనిపించి ఎంత ఎక్కువమంది సినిమా చూస్తే అంత మంచిది.. అయినా సరే అడుగుతున్నాను.. ఎందుకంటే వాళ్ళంతా ఈటీవీ విన్ సబ్‌స్క్రైబ్ చేసుకుని చూస్తే నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగొస్తే ఇంకొన్ని మంచి సినిమాలు తీస్తారన్న స్వార్ధం.. మీ ల్యాండింగ్ పేజీలో కనిపిస్తున్న సినిమాలలో సగానికి పైగా చిన్నా చితకా సినిమాలే.. చెప్పండి బ్రదర్.. నీతికోసం, పేదవాడికోసం నిజాయితీగా నిలబడే రాబిన్‌హుడ్ పోజులు కొడుతున్నారుగా.. చెప్పండి.. ఎందుకీ హిపోక్రసీ..WHAT YOU’RE DOING IS NOTHING SHORT OF RAPE.. ఒక మాట చెబ్తా బ్రో.. సలహా అనుకోండి లేదా ఛాలెంజ్ అనుకోండి.. కానీ తీసుకోండి.. చేసి చూపించండి.. చిన్న పనే..ఒక సినిమా ప్రొడ్యూస్ చేయండి.. అంతే.. పెయిన్ తెలీడానికి.. పీయస్: అసలు పెద్ద సినిమాలకైనా సరే మీ లాజిక్ ఏవిధంగా తప్పో ఇంకో పోస్టులో చెబ్తా” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.