రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు (జూలై 14) తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. అంతా బాగా జరుగుతున్నా తరుణంలో వరుణుడు దెబ్బ ఈ సినిమాకు గట్టిగా తగిలేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. ఈ తుఫాన్ ఇంకా మూడు రోజుల వరకు ఉందనున్నదని వాతావరణ శాఖ తెలుపుతోంది.
వర్షం వలన రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామ్ సినిమాకు ఎవరు వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది. రేపు ఉదయం నుంచి ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ టైమ్ అనేది చెప్పకపోవడం విశేషం. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండడంతో చాలామంది ప్రీమియర్ షోలను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకు పెద్ద దెబ్బే అని అనుకోవచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా గురించిన బజ్ అస్సలు లేకపోవడం. రామ్ అభిమానులు కూడా ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని అంటున్నారు. మరి ఈ అడ్డంకులను రామ్ ఎలా ఎదుర్కొంటాడు.. రేపు ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి.
