Site icon NTV Telugu

Raghu Babu : నవ్వులతో రఘుబాబు రుబాబు!

Raghu Babu Birthday Special

Raghu Babu Birthday Special

తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో!

యర్రా రఘుబాబు 1960 జూన్ 24న జన్మించారు. రఘుబాబు పుట్టిన తరువాతే ఆయన తండ్రి గిరిబాబు సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలెట్టారు. గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే రఘుబాబు కూడా సినిమా రంగంలో అడుగుపెట్టాలనుకున్నారు. అయితే అతని తమ్ముడు బోసుబాబును హీరోగా పరిచయం చేయడంతో, తండ్రి నిర్మించే చిత్రాలకు ప్రొడక్షన్ చూసుకుంటూ సాగారు. దర్శకనిర్మాత సత్యారెడ్డి తన ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రంలో రఘుబాబును కీలక పాత్రలో నటింప చేశారు. అయినా డబ్బింగ్ సినిమాలు తీయడం, వాటిని విడుదల చేయడం చేసేవారు రఘుబాబు. మరికొన్ని వ్యాపారాలతో చేతులు కాల్చుకున్నారు. ఆ సమయంలో ఇక నటన తప్ప వేరే మార్గం కనిపించని రఘుబాబుకు మొదట్లో తిరస్కారాలు ఎదురయ్యాయి. అయితే అన్నిటినీ చిరునవ్వుతో ఓదార్చుకుంటూ అందిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకున్నారు. కొన్ని టీవీ సీరియల్స్ లోనూ నటించారు. ఆ పై ‘మురారి’, ‘ఆది’ చిత్రాలలో రఘుబాబుకు గుర్తింపు ఉన్న పాత్రలు లభించాయి. ఆ తరువాత నవ్వించడమూ అలవాటు చేసుకున్నారు. ఆయన కామెడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎందరెందరో కామెడీ పండించడానికి సై అంటూ వచ్చేస్తున్నారు. అయినా రఘుబాబు తనదైన నటనతో నవ్వుల నావ నడుపుకుంటూ చిత్రసాగరంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఏ నాడయితే రఘుబాబు నవ్వులు పండించడం మొదలు పెట్టారో, ఆ తరువాత నుంచీ వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఏడాదికి ఆరేడు సినిమాల్లో కనిపిస్తూనే రఘుబాబు అలరిస్తున్నారు. నవతరం హాస్యనటులు బయలు దేరుతున్నా, వారికీ గట్టిపోటినిస్తున్నారు రఘుబాబు. అందువల్లే దర్శకనిర్మాతలు, రచయితలు రఘుబాబు కోసమే అన్నట్టు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను క్రియేట్ చేసి, ఆయనను అందులో పరకాయప్రవేశం చేయిస్తున్నారు. అలా ప్రతీసారి రఘుబాబు మార్కులు సంపాదిస్తున్నారనే చెప్పాలి. గిరిబాబు ఎనిమిది పదులు దాటినా ఇంకా దరిచేరిన పాత్రలను పోషిస్తున్నారు. రఘుబాబు కూడా అదే తీరున సాగుతారేమో చూడాలి.

Exit mobile version