సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి దర్శక నిర్మాతలు చెబుతూ, ”బండ లింగపల్లిలో ఓ ధనవంతురాలి బిడ్డ గౌరి. జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం అనే పత్రికకు వార్తలు సేకరించి పంపుతూ ఉంటుంది. డాక్టర్ ఆనంద్ తన గ్రామంలో హాస్పిటల్ పెట్టాలనుకుంటాడు. అయితే అతనికి కాస్త స్వార్థం. తన పని పూర్తయితే చాలు అనుకునే రకం. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జత కలుస్తాడు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. తమ సమస్యలు తీరాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అనుకుంటారు.
Read Also : “లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు
అదే సమయంలో అంతరిక్షంలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహం స్కైలాబ్‌లో సాంకేతిక కారణాల వల్ల పెను ప్రమాదం వాటిల్లబోతోందని రేడియోలో వార్త వస్తుంది. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని అందరూ భావిస్తారు. అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనదే ‘స్కైలాబ్’ మూవీ కథ” అని అన్నారు. గురువారం ఈ సినిమాలోని ‘ఆహా ఏమి ఊరు… సిత్రం దీని తీరు’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. పాట సాగే తీరులోనే బండ లింగపల్లి జనం మెంటాలిటీని ఫన్నీ-వే లో రచయిత ఎస్. భరద్వాజ పాత్రుడు తెలిపారు. ప్రశాంత్ ఆర్. విహారి ఈ పాటకు చక్కని ట్యూన్ చేశారు. దానికి తగ్గట్టుగా సీన్ రోనాల్డ్ దీన్ని గానం చేశారు. ఈ లిరికల్ వీడియో సైతం కొత్తగా ఉండి, ఆకట్టుకుంటోంది. ‘స్కైలాబ్’ చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
