Punam kaur meets President Draupadi murmu: తాజాగా ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్, రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ అనే చేనేత కార్మికుడుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం లోని ఆచంట వేమవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ అతుకులు లేని, 8 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు గల “ఏక వస్త్ర జాతీయ జెండా”ను తన సొంత మగ్గాలపై తయారు చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకుని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతుతో, సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టి, సత్యనారాయణ “ఏక వస్త్ర జాతీయ జెండా”ను రూపొందించారని తెలుస్తోంది. జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక చక్రంతో సహా, అద్భుతమైన రీతిలో ఏ మాత్రం అతుకులు లేకుండా జాతీయ జెండాను ఖాదీ నూలుతో సత్యనారాయణ తయారు చేశారు. జాతీయ జెండా మధ్యలో ఉండే ఆశోక చక్రం కూడా జెండాలో కలిసిపోయేలా అతుకులు లేకుండా రూపొందించేందుకు ప్రత్యేక మగ్గాన్ని తయారు చేసుకున్న సత్యనారాయణ దానితోనే జెండాను రూపొందించారు.
Seerat Kapoor: త్రివర్ణ రంగుల్లో మెరిసిన సీరత్ కపూర్
ఒక్కసారైనా ఢిల్లీలోని ఎర్రకోట పై తాను తయారు చేసిన జాతీయ జెండా ఎగరాలన్న సత్యనారాయణ కోరిక తెలుసుకుని ఏపీ ప్రభుత్వ చేనేత అంబాసిడర్” పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచారు. చేనేత కార్మికుల సంక్షేమం పట్ల ఎంతో ఆపేక్ష వ్యక్తం చేసే పూనమ్ కౌర్, చేనేత కార్మికుడు సత్యనారాయణ తయారు చేసిన “ఏక వస్త్ర జాతీయ జెండా”ను తయారు చేసిన విషయం తెలుసుకుని స్వయంగా సంప్రదించి, మద్దతుగా నిలవడమే కాదు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పాయుంట్మెంట్ తీసుకుని, నిన్న స్వయంగా కలిసి అతుకులు లు, మిషన్ కుట్టు లేని “ఏక వస్త్ర జాతీయ జెండా”ను సమర్పించారు. ఈ క్రమంలో ఎన్టీవీతో మాట్లాడుతూ, ఎర్రకోట పై ఒక్కసారైనా తాను తయారు చేసిన “జాతీయ జెండా”ను ఎగరవేయాలన్న ఆకాంక్షను రాష్ట్రపతి ముర్ముకు విన్నవించుకున్నానని చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ తెలిపారు. నా ఆకాంక్షను నెరవేర్చే అంశాన్ని పరిశీలిస్తామని” రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు, సత్యనారాయణ సంతోషంగా చెప్పారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ, “సొంత ఇంటిని సైతం తాకట్టు పెట్టి జాతీయ జెండాను తయారుచేసిన సత్యనారాయణకు ఓ ఇల్లును ఇవ్వాలని”, ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
